అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు.. కేవలం ట్రైలర్ మాత్రమే.. లేఖలో..?
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న కారును పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కారులో ఆగంతకుడు రాసిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్న ముంబై పోలీసులు.. అందులోని వివరాలను శుక్రవారం బహిరంగ పర్చారు.
లేఖను ఆంగ్లంలో రాశాడని, ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలను ఉద్ధేశించి బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు పదార్థాలున్న కారును మీ ఇంటి సమీపంలో వదిలివేయడం కేవలం ట్రైలర్ మాత్రమేనని ఆగంతకుడు లేఖలో బెదిరించాడని పోలీసులు పేర్కొన్నారు.
ముఖేష్ అంబానీ, నీతాఅంబానీ, కుటుంబానికి ఒక అదృష్టమని, మరోసారి పేలుడు పదార్థాలు మీ వద్దకే వస్తాయంటూ ఆగంతకుడు హెచ్చరించాడని అన్నారు. అంతేకాదు, అంబానీ కుటుంబం మొత్తాన్ని అంతం చేయడానికి ఈసారి పూర్తి సన్నద్ధతతో వస్తానని బెదిరించినట్టు తెలిపారు. పేలుడు పదార్థాలతో లభ్యమైన వాహనం నెంబరు కొన్ని ముఖేశ్ అంబానీ కాన్వాయ్ కారు నంబర్ ప్లేట్లతో మ్యాచ్ అయ్యాయని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ నివాసమున్న ప్రాంతంలో భద్రతను పెంచారు. గాందేవీ పోలీసు స్టేషన్ పరిధిలోని కార్మికెల్ రోడ్‌లో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని గుర్తించిన పోలీసులు.. వెంటనే అప్రమత్తమై బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు.
ఇతర పోలీసు బలగాలు కూడా అక్కడకు చేరుకుని.. అందులో పేలుడు పదార్థాలను గుర్తించాయి. ఆ వాహనం అక్కడికి ఎలా వచ్చిందనే దిశగా విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు తర్వాత నిజానిజాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.