మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (18:36 IST)

ఏపీలో కరోనా అప్‌డేట్స్ : అనంతపురంలో సున్నా.. రాష్ట్రంలో 81

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గపోయింది. గడిచిన 24 గంటల్లో కేవలం 81 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 
 
గత 24 గంటల్లో అత్యధికంగా కడప జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 263 మంది కోలుకున్నారు. విశాఖ జిల్లాలో ఒక వ్యక్తి కరోనా వల్ల మృతి చెందాడు.
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,86,066కి చేరింది. మొత్తం 7,141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 8,77,212 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 1,713 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  
 
మరోవైపు, దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 13,788 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 14,457 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 145 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,419 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,11,342 మంది కోలుకున్నారు. 2,08,012 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
ఇకపోతే, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 346 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,872 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,86,244 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,579కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,049 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,281 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 45 కరోనా కేసులు నమోదయ్యాయి.