కరోనా కేసులను తెలంగాణ సర్కారు దాస్తోందా?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా ఉంది. గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో నమోదైన పాజిటివ్ కేసులతో పోల్చుకుంటే ఈ విషయం తేటతెల్లమవుతుంది. అయితే, ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిస్తున్న గణాంకాలు చూస్తే చాలా తక్కువగా ఉంటున్నాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 142 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. అలాగే, కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 178 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,153కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,96,740 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,644 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,769 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 633 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు, భారత్‌లో గత 24 గంటల్లో 15,388 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వాటి ప్రకారం... 16,596 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,44,786కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 77 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,930కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,99,394 మంది కోలుకున్నారు. 1,87,462 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.