గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (09:00 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టింగ్ ధర తగ్గింపు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కిట్ల ధరలను సర్కారు మరోమారు పునఃపరిశీలన చేసింది. కరోనా టెస్టింగ్‌ కిట్ల ధరలు తగ్గడంతో కొవిడ్‌-19 టెస్ట్‌ ధరలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం రూ.1000 ఉన్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ధరను ప్రభుత్వం రూ.499కు తగ్గించింది. వీటీఎం, పీపీఈ కిట్‌తో కలిపి ఈ ధరను నిర్ణయించింది. కొత్త ధరలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
కాగా, కరోనా అనుమానితులు నేరుగా ల్యాబ్‌కు వెళ్లి పరీక్ష చేయించుకుంటే రూ.499 చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం నుంచి ప్రైవేటు ల్యాబ్స్‌కు పంపించిన శాంపిల్స్‌కు మాత్రం రూ.475కే పరీక్ష చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
ఐసీఎంఆర్‌ అనుమతిచ్చిన ల్యాబ్‌లలో మాత్రమే కరోనా పరీక్షలు చేయాలని స్పష్టంచేశారు. సవరించిన ధరల ప్రైవేటు హాస్పిటల్స్‌, ల్యాబ్స్‌ బయట ఖచ్చితంగా ప్రదర్శనకు ఉంచాలని పేర్కొన్నారు. కొత్త రేట్లు అమలయ్యేలా పర్యవేక్షించాల్సిన బాధ్యతను జిల్లాల డీఎంహెచ్‌వోలకు ప్రభుత్వం అప్పగించింది.