భారత్‌లో కరోనా విశ్వరూపం.. 90 వేలు దాటిన పాజిటివ్ కేసులు..
భారత్‌లో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఫలితంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో మరో 4987 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 90,927కు చేరాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
గత 24 గంటల్లో భారత్‌లో 4,987 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు దేశంలో ఒక్క రోజులో నమోదయిన కేసుల్లో ఇదే గరిష్టం. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 90,927కి చేరింది.
24 గంటల్లో దేశంలో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,872కి చేరింది. అలాగే, కరోనా నుంచి 34,109 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 53,946 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు, తెలంగాణాలో శనివారం మరో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 1509కి చేరాయి. ఈ 55 కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 44 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి కేసుల చొప్పున నమోదయ్యాయి.