కరోనా కాటుకు ఆఫ్రికా ఎస్వాతినీ దేశ ప్రధాని మృతి
కరోనా కాటుకు ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం 12 లక్షల జనాభా కలిగిన ఆఫ్రికా దేశమైన ఎస్వాతినీలో ఇప్పటివరకు 6,768 కరోనా కేసులు నమోదవగా, 127 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
తాజాగా ఆఫ్రికాలోని ఎస్వాతినీ అనే దేశానికి ప్రధాన మంత్రి ఆంబ్రోసో మాండ్వులో లామిని (52) కరోనాతో మృతిచెందారు. నాలుగు వారాల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్వాతినీ ఉపప్రధాని థెంబా మసుకు ఒక ప్రకటనలో తెలిపారు.
కరోనాకు మెరుగైన చికిత్స నిమిత్తం డిసెంబర్ 1న ఆంబ్రోస్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు. అయితే పరిస్థితి విషమించి ఆదివారం అర్థరాత్రి మరణించారని అన్నారు. కాగా, అతిచిన్న దేశమైన ఎస్వాతినిలో సంపూర్ణ రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉంది. 2018లో ఆయన ఎస్వాతినీకి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది పోలాండులోని కటోవిస్ నగరంలో జరిగిన ప్రపంచ సదస్సులో వాతావరణ మార్పులపై ఆంబ్రోస్ ప్రసంగించారు. అంతకుముందు ఆయన బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు.