శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 28 నవంబరు 2020 (09:23 IST)

హైదరాబాద్‌లో ప్రధాని మోడీని కేసీఆర్ స్వాగతించాల్సిన అవసరంలేదు: పీఎంఓ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా గతంలో అనుసరించిన సంప్రదాయాలకు ఈసారి తిలోదకాలు ఇచ్చారు. సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. ఈసారి కూడా అలాగే చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భావించారు.
 
శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. దీనికి స్పందనగా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది. ప్రధాన మంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఫోన్ చేసి చెప్పారు
అంతేకాకుండా ప్రధానమంత్రికి స్వాగతం చెప్పడానికి కేవలం ఐదుగురికి మాత్రమే పిఎంవో అవకాశం ఇచ్చింది. హకీంపేట ఎయిర్ ఆఫిస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామొహంతి, సైబరాబాద్ సి.పి. సజ్జనార్‌లు మాత్రమే హకీంపేట విమానాశ్రయానికి రావాలని పిఎంవో ఆదేశాలు పంపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది.
 
గతంలో ఏ ప్రధానమంత్రి అయినా రాష్ట్రాల్లో అధికారిక పర్యటన జరపడానికి వస్తే గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం చెప్తారు. కానీ ఈసారి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి కార్యాలయం వారించడం విశేషం. ప్రధానమంత్రి కార్యాలయం నుండి గతంలో ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ రాలేదని, ఇలా ఎందుకు చేశారో అర్ధం కావడం లేదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానించారు.