మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: సోమవారం, 3 ఆగస్టు 2020 (17:30 IST)

హైదరాబాద్‌లో దారుణం, కరోనా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అంటూ లక్షలు వసూలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇలాంటి టైమ్‌లో మానవత్వంతో ఆలోచించకుండా ప్రజల నుంచి వీలైనంతగా డబ్బులు లాగేయాలని... లక్షల్లో బిల్లు వేస్తున్నాయి ప్రైవేట్ హాస్పటల్స్. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హస్పటల్ బరితెగించింది. ప్రభుత్వం తాము చెప్పిన రేటుకే వైద్యం చేయాలని సూచిస్తోన్నా, మందుల పేరుతో, పిపిఈ కిట్ల పేరుతో, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారు.
 
ఇలాంటి ఒక వ్యవహారమే రెండ్రోజుల క్రితం సోమాజిగూడాలోని ప్రముఖ ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే... ఒక కుటుంబం మొత్తాన్ని కరోనా చిదిమేయగా అందులో ఈ ఆసుపత్రి పాపం పంచుకుంది. అయితే.. ఈరోజు మరో దారుణం బయటకొచ్చింది. కరోనా లక్షణాలతో ఓ రోగి ఆసుపత్రిలో చేరగా పరీక్షల అనంతరం నెగిటివ్ వచ్చింది. 
 
అయితే... ఆ విషయాన్ని దాచిపెట్టి పాజిటివ్ వచ్చిన రోగులతో ఉంచింది ఆసుపత్రి యాజమాన్యం. తమకి చికిత్స వద్దని డిశ్చార్జ్ చేయమని బ్రతిమిలాడినా లక్షల బిల్లు చెల్లించాలని, అది చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పినటు సమాచారం. దీంతో ఏమి చేయాలో పాలుపోక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నా... ప్రభుత్వం మాత్రం ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదంటున్నారు ప్రజలు.