మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (16:06 IST)

"ఆత్మ" బంధువులు, కరోనాతో మరణిస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా అంత్యక్రియలు, ఎక్కడ?

ఎవరైనా కరోనాతో మరణిస్తే కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రావడం లేదు. అందరూ ఉన్నా అనాధ శవంలాగా  వదిలేయాల్సిన  దుస్థితి ఏర్పడుతోంది. అయితే బంధువులు దూరంగా పెట్టిన మృతులకు ఆత్మబంధువులుగా మారారు వాళ్ళు. కరోనాతో చనిపోయిన వారికి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 
 
ఎంత గొప్పగా బతికిన వారైనా ఎంత బంధువులు ఉన్నా ప్రస్తుత సమాజంలో కరోనాతో ఎవరైనా మరణిస్తే అనాధ శవంగా మారిపోతున్నారు. సొంత కుటుంబ సభ్యులే చనిపోయిన తమ వారి మృతదేహాల దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. మరోవైపు ఏదైనా గ్రామంలో ఒక వ్యక్తి కరోనాతో చనిపోతే అతని అంత్యక్రియలు కూడా ఆ గ్రామంలో జరిపేందుకు కొందరు ఒప్పుకోవడం లేదు. మనిషి చనిపోయిన తర్వాత  కరోనా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశాలు తక్కువ అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చాలామంది చెవికి ఎక్కించుకోవడం లేదు. 
 
ఇలాంటి పరిస్థితులలో బంధువులు కాదన్న మృతదేహాలకు ఆత్మ బంధువులుగా మారారు చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఆ వ్యక్తులు. ఇంజనీర్ వృత్తిలో ఉన్న రాయల్ బాబు చలవతో ఓ హోటల్ యజమాని అయిన పటాన్ ఖాదర్ ఖాన్, సామాజిక కార్యకర్త అంజలి, కరాటే మాస్టర్‌గా పనిచేస్తున్న సురేష్ కలిసి కరోనా మృతుల అంత్యక్రియల కోసం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.
 
కరోనాతో ఎవరైనా చనిపోతే బంధువులు పట్టించుకోకపోతే అంత్యక్రియలు చేసేందుకు సొంత ఖర్చులతో ముందుకు వచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. అలాగే మృతదేహాలను తరలించేందుకు ప్రత్యేక వాహనం కూడా ఏర్పాటు చేశారు. ఇలా వీరు చేస్తున్న మంచి పనికి స్థానికంగా మరికొందరు తోడ్పాటు అందించేందుకు ముందుకు వచ్చారు.
 
ఏ మతం వారు కరోనాతో చనిపోయినా ఆయా మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని అంటే ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని, అందుకే తాము ఈ మంచి పనికి పూనుకున్నామని వీరంతా చెబుతున్నారు. ఏ సంబంధం లేకపోయినా కరోనా మృతులకు ఆత్మ బంధువులుగా మారడం ఆనందంగా ఉందంటున్నారు.