శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (10:59 IST)

కరోనా నెగటివ్ అయినా కోవిడ్ చికిత్స.. 3లక్షల బిల్లు.. న్యాయవాదికే ఇలా జరిగితే?

హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిందని ఆస్పత్రికి వెళ్తే.. ఆస్పత్రి యాజమాన్యాలు కరోనా సాకుతో వ్యాపారం చేసుకుంటున్నాయి. కరోనా లేకపోయినా ఓ న్యాయవాదిని కరోనాకు చికిత్స అందించే వార్డులో ఉంచి, నాలుగు రోజుల పాటు చికిత్స చేసి రూ.3 లక్షల బిల్లు వేసింది ఓ హైదరాబాదు ఆస్పత్రి. ఈ ఘటనపై ఆ న్యాయవాది పోలీసులను ఆశ్రయించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని విజయనగర్‌కాలనీకి చెందిన శ్రీధర్‌సింగ్‌ అనే న్యాయవాదికి జూలై 28న స్వల్పంగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. దీంతో ఆయన సోమాజీగూడలోని డెక్కన్‌ ఆస్పత్రికి వెళ్లారు. కరోనాగా అనుమానించిన వైద్యులు ఆయనకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు. ఆ సమయంలో ఆయన ఆధార్‌కార్డు తీసుకున్నారు. 
 
కానీ, నమూనా పంపేటప్పుడు.. ఆయన ఫోన్‌ నంబరు ఇవ్వకుండా, తమ ఉద్యోగి ఫోన్‌ నంబరు పెట్టారు. శ్రీధర్‌ను కరోనా వార్డులో ఉంచారు. పరీక్ష ఫలితం నెగెటివ్‌గా వచ్చినా.. ఆ విషయాన్ని శ్రీధర్‌కు చెప్పకుండా కరోనా చికిత్స చేశారు. తన పరీక్ష ఫలితంపై శ్రీధర్‌ ఆస్పత్రి నిర్వాహకులను గట్టిగా నిలదీయగా రిపోర్టును అందజేశారు.
 
అందులో నెగెటివ్‌ అని ఉండడంతో.. తనకు కరోనా చికిత్స ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయినా ఆస్పత్రి నిర్వాహకులు పట్టించుకోలేదు. చివరకు ఆయన..తన తోటి న్యాయవాదులకు ఈ విషయం చెప్పడంతో అప్రమత్తమై ఆగస్టు 1 అర్ధరాత్రి డిశ్చార్జ్‌ చేస్తున్నట్టు చెప్పారు. 
 
మూడు లక్షల రూపాయలు బిల్లు వేసి.. ఆగస్టు 2న ఆయన ఆ బిల్లు చెల్లించాకే బయటకు పంపారు. డిశ్చార్జి సమయంలో ఆయన చేతికి అమర్చిన కాన్యులా కూడా తొలగించలేదు. ఇంటికి వచ్చిన అనంతరం ఆ న్యాయవాది.. పంజగుట్టా పోలీసులకు ఆస్పత్రి తీరుపై ఫిర్యాదు చేశారు.
 
పోలీసులు విచారణ ప్రారంభించారు. కరోనా వంటి వైరస్ సోకినా.. ఆ సాకుతో డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తున్న ఆస్పత్రులపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి క్లినిక్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.