గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మోహన్‌బాబు ఫాంహౌస్‌లోకి దూసుకెళ్లిన ముగ్గురు అగంతకుల అరెస్టు!!

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది సెలెబ్రిటీలకు ముఖ్యంగా, హీరోలకు ప్రత్యేకంగా ఫాంహోస్‌లు ఉన్నాయి. అలాంటి వారిలో హీరో డాక్టర్ మోహన్ బాబు ఒకరు. అయితే, ఈయన ఫాంహౌస్‌లోకి శనివారం రాత్రి ఇన్నోవా కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు దూసుకెళ్లారు. దీనిపై మోహన్ బాబు ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి, నలుగురు వ్యక్తుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు 
 
సీసీటీవీ దృశ్యాలు, కారు నంబరు ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులంతా మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కాల్‌డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ అగంతకులు వచ్చిన కారు ఓ మహిళ పేరుతో రిజిస్టరై వున్నట్టు పోలీసులు కనుగొన్నారు. 
 
కాగా, నిన్న రాత్రి  మోహన్‌బాబు ఫాంహౌస్‌లోని ఇంట్లోకి దూసుకెళ్లిన ఆ నలుగురు యువకులు ‘మిమ్మల్ని వదలం’ అంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.