సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (16:47 IST)

కరోనా దెబ్బకు ఉద్యోగం ఊడింది... ఆ టెక్కీకి సోనూ సూద్ ఉద్యోగమిచ్చారు..

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పేరు ఇపుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎక్కడ కష్టమొచ్చినా నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నాడు. వలస కూలీల మొదలుకుని వారువీరూ అనే తేడాలేకుండా కష్టమన్నవారికి తనవంతు సాయం చేస్తున్నాడు. నిన్నటికి నిన్న తన ఇద్దరు కుమార్తెలను కాడెద్దులుగా మార్చి దుక్కితున్న రైతును చూసిన చలించిపోయిన ఈ సినీ విలన్.. వారికి ట్రాక్టర్ సమకూర్చాడు. ఆ తర్వాత కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి కూరగాయలు విక్రయించుకుంటున్న శారదకు సోనూసూద్ ఉద్యోగం ఇప్పించాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన 26 ఏళ్ల ఉండాది శారదాను కరోనా కారణంగా తన ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆమె కుటుంబం గడవడానికి కూరగాయలను విక్రయిస్తూ జీవించసాగింది. 
 
ఈ విషయం బయటకు పొక్కింది. రిట్చీ షెల్సన్ అనే యువకుడు తన ట్విట్టర్‌ ఖాతాలో శారదకు సాయం చేయాల్సిందిగా సోనూసూద్‌కు విజ్ఞప్తి చేశాడు. 'ప్రియమైన సోనూసూద్ సార్ హైదరాబాద్‌కు చెందిన శారదా కరోనా కారణంగా తన ఉద్యోగం నుంచి తొలగించబడింది. ఆమె తన కుటుంబం కోసం కూరగాయలు విక్రయిస్తోంది. దయచేసి మీరు ఆమెకు ఏమైనా మద్దతు ఇవ్వగలరా? మీరు ఆమెకు సాయం చేస్తారని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేస్తూ, సోనూసూద్‌కు ట్యాగ్‌ చేశాడు. 
 
దీనికి వెంటనే స్పందించిన సోనూసూద్‌ తన అధికారి ఆమెను కలిశారని. ఆమెకు ఉద్యోగ నియామక లేఖ కూడా అందిందని ఆయన ట్వీట్‌ చేశారు. 'నేను సోనూసూద్‌ను చాలా కాలం నుంచి గమనిస్తున్నా.. ఆయన చాలా మంది పేదలకు సాయం చేస్తున్నారు. అని శారదా అన్నారు'. అయితే ఆమెకు ఎలాంటి జాబ్‌ ఆఫర్‌ వచ్చిందో ఆమె తెలుపలేదు.