శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (22:47 IST)

మాస్క్ ధరిస్తే మహారాజులే.. కరోనా ముత్తాత కూడా ఏం చేయలేడు...

కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలంటే ఏకైక మార్గం మాస్క్ ధరించడం. ఈ మాస్క్ ధరించి, చేతులను శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఉంటే కరోనా ముత్తాత కూడా ఏం చేయలేడని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, ప్రజలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మాస్క్ సరిగ్గా ధరిస్తే వ్యాక్సిన్ వేసుకున్నంత రక్షణ అని అంతర్జాతీయంగా పలు పరిశోధన సంస్థలు అధ్యయనాలు చేసి మరీ తేల్చాయి.
 
అయితే, మాస్క్ వేసుకోవడం అంటే.. గడ్డం కిందకు వేసుకోవడంకాదు. మాస్క్‌ను సరిగ్గా వేసుకోవాలి. ఎందుకంటే.. మన దగ్గర మాస్కు ముక్కుకు కాదు.. మూతికి అని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. మాస్కు వేసుకుంటున్నవారిలో సగం మంది ముక్కు కిందకు దించి వాడుతున్నారు. 
 
అందుకే మన చేతిలో.. మనం చేయగలిగిన ఈ పనిని సరిగా చేస్తే.. వ్యాక్సిన్‌ మీ దాకా వచ్చేవరకూ అదే రక్షణ కల్పిస్తుందని అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పేర్కొంది. అంతేకాదు..ఇటీవల మాస్క్‌ల ధారణ, కొనుగోలుపై మరోమారు మార్గరద్శకాలనూ విడుదల చేసింది.
 
ఎలాంటి మాస్క్ ధరించినా అది మల్టీలేయర్‌గా ఉంటే చాలా మంచిది. కనీసం మూడు పొరలు ఉండాలి. దగ్గరగా నేసినవై ఉండాలి. మీరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. డిస్పోజబుల్‌ మాసు్కలకూ ఇదే వర్తిస్తుంది. నోస్‌ వైర్‌ తప్పనిసరిగా ఉండాలి. మాస్కును కాంతి వస్తున్న వైపు పెట్టినప్పుడు అది దాన్ని నిరోధించేలా ఉండాలి. 
 
అదేసమయంలో మాస్క్ వేసుకున్న తర్వాత చాలామంది మాస్కులకు వాల్వులు ఉన్నవి వాడుతున్నారు. అలాంటివి వద్దు. అలాగే ఒకే పొర ఉన్నవి.. కాంతిని నిరోధించలేని మాస్కులను కొనుగోలు చేయవద్దు. 
 
ఎన్-95 లేదా కేఎన్-95 వాడేటప్పుడు దాని మీద మరో మాస్కును వాడవద్దు. వైద్య సిబ్బంది ఎక్కువగా వాడే వీటిని ఇప్పుడు సామాన్య జనమూ వినియోగిస్తున్నారు. ఇవి మరింత సురక్షితమైనవి అని పేరు ఉండటంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. 
 
అయితే, కేఎన్-95 మాస్క్‌లు ఎక్కువగా చైనాలో తయారవుతాయి. వీటిల్లో నకిలీలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదులు అమెరికాలో ఉన్నాయి. కాబట్టి వాటిని కొనేటప్పుడు కాస్త చూసి తీసుకోవాలి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నా.. వీటిని వాడవద్దు.