ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 14 మార్చి 2020 (18:53 IST)

కరోనా వైరస్ నియంత్రణ: తెలంగాణలో స్కూళ్లు-థియేటర్లు మూసివేత- తితిదే సంచలన నిర్ణయం

కరోనా వైరస్ చాప కింద నీరులా దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. దీనితో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు తాత్కాలికంగా ఈ నెల 31 వరకూ మూసివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్ధతికి తాత్కాలికంగా స్వస్తి పలుకుతూ టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని నిర్ణయించింది. ఇంతకుముందులా కంపార్ట్‌మెంట్లులో వేచి ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం వున్నదని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ఈవో వెల్లడించారు. ఇంకా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెపుతూ... దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోందన్నారు. 
 
వైరస్ తీవ్రత దృష్ట్యా అది వ్యాప్తి చెందకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు గదులు ఖాళీ చేసిన తర్వాత శుద్ధి చేసి ఆ పిమ్మట మరొకరికి ఇస్తున్నట్లు చెప్పారు. కనుక భక్తులు కూడా సహకరించాలనీ, కరోనా వైరస్ లక్షణాలయిన జలుబు, దగ్గు, జ్వరం వున్నవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఒకవేళ ఇలాంటి లక్షణాలున్నవారు కనబడితే అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.