మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 12 మార్చి 2020 (22:34 IST)

కరోనా వైరస్: దిల్లీలో సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు మార్చి 31 వరకూ బంద్

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ రాజధాని దిల్లీలోని అన్ని సినిమా హాళ్లు, ప్రస్తుతం పరీక్షలు జరగుతున్న స్కూళ్లు, కాలేజీలు మినహా మిగిలిన అన్ని విద్యా సంస్థలను మార్చి 31 వరకూ మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
 
1. ప్రస్తుతం ఉన్న అన్ని వీసాలు (డిప్లొమేటిక్, అఫీషియల్, ఐరాస, అంతర్జాతీయ సంస్థలు, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలు తప్ప) ఏప్రిల్ 15 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్చి 13 నుంచి అమల్లోకి వస్తుంది.
 
2. ఓసీఐ కార్డుదారులకు ఉన్న వీసా-ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని ఏప్రిల్ 15 వరకు నిలుపివేసింది. 13 మార్చి 2020 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
 
3. అత్యవసరంగా భారత్ సందర్శించాలనుకునే ఏ విదేశీయుడైనా తమ సమీప భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి.
 
4. చైనా, ఇటలీ, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల నుంచి ఫిబ్రవరి 15 తర్వాత వచ్చిన భారతీయులు లేదా విదేశీయులను 14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తారు.
 
5. భారత పౌరులతో సహా భారత్‌కు వచ్చే విదేశీయులు అత్యవసరం కాని తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. అలా ఎవరైనా భారత్‌కు వస్తే వారిని కనీసం 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతారు.
 
6. భారత పౌరులు అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. వారు తిరిగివచ్చిన తర్వాత కనీసం 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది.
 
7. అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశించడానికి కొన్ని ప్రత్యేక చెక్ పోస్టుల వద్ద మాత్రమే అనుమతిస్తారు. అక్కడ కూడా భారీ స్క్రీనింగ్ ఏర్పాట్లు ఉంటాయి. వీటిని హోంమంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది.
 
8. ఇటలీలో ఉన్న విద్యార్థులు, కారుణ్య కేసులను పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేసింది. నమూనాల సేకరణ తదనుగుణంగా జరుగుతుంది. ఈ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారు భారత్‌కు తిరిగిరావచ్చు. కానీ వారు కూడా కనీసం 14రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండాలి.
 
కోవిడ్-19 పరిస్థితిపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
 
పౌరులందరి రక్షణకు అన్ని రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలు అనేక చర్యలు చేపడుతున్నాయని మోదీ తెలిపారు.
 
"భయపడాల్సిన పని లేదు, ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. కేంద్ర మంత్రులెవరూ రానున్న కొద్ది రోజుల్లో విదేశీ ప్రయాణాలు చేయరు. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని నేను అందరినీ కోరుతున్నా. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడకుండా ఉండటం ద్వారా వైరస్ వ్యాప్తిని మనం సమర్థంగా అడ్డుకోవచ్చు" అని మోదీ సూచించారు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణపై కూడా ఆలోచించాలని తాము సూచిస్తామని, అయితే, తుది నిర్ణయం నిర్వాహకులదే అని విదేశాంగ శాఖ వెల్లడించింది. కరోనావైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది. గత రెండువారాల్లో చైనా బయట నమోదైన కేసులు 13రెట్లు పెరిగాయని ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.