శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (10:50 IST)

ఇలా చేయగలిగితే మీకు కరోనా లేనట్టా? లేనట్టా?

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 192 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఈ దేశాల్లో భారత్ కూడావుంది. దీంతో ప్రజలు ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. అయితే, ఈ కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభావం గురించి ప్రజల్లో అనేక అపోహలు, సందేహాలు ఉన్నాయి. వీటిలో నిజానిజాలపై అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఇందులోభాగంగా కరోనాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి అధీకృత సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ వస్తోంది. 
 
కరోనాపై నెలకొన్న అపోహలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన వివరణ మేరకు.. ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల్లో కరోనా ప్రభావం పెద్దగా ఉండదని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో వచ్చే రెండు నెలలు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కరోనా గురించి ఆందోళన అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. ఇది అపోహ మాత్రమేనని డబ్ల్యూహెచ్ఓ గుర్తుచేస్తోంది. 
 
దీనికి కారణం లేకపోలేదు. సింగపూర్‌, ఆస్ట్రేలియా వంటి వేడి ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాపించింది. చైనాలోని అన్ని రకాల వాతావరణ ప్రాంతాల్లో వైరస్‌ సోకినందున వేడి వాతావరణంలో కరోనా రాదనుకోవడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ వెల్లడించింది. సార్స్‌, ఇతర వైరస్‌లతో కరోనాను పోల్చకూడదని పేర్కొంది.
 
అదేసమయంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లోనే కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో పిల్లలకు కరోనా రాదనే అపోహ చాలామందిలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా కరోనావైరస్‌ సోకే అవకాశం ఉందని తేలింది. 
 
అయితే, ఈ వైరస్ సోకిందో లేదో తెలుసుకున్న పది సెకన్ల పాటు ఆపకుండా గాలి పీల్చగలిగితే చాలట. నిజానికి ఇది మరో పెద్ద అపోహ మాత్రమే. ఊపిరితిత్తుల సమస్య వల్ల తీవ్రంగా ఇబ్బందిపడేవారిని గుర్తించడానికి ఇలాంటివి కొంతవరకు ఉపయోగపడొచ్చు. కానీ కరోనా ఇతర వైరస్‌లకంటే భిన్నమైనది. 
 
వ్యాధి సోకినా కొన్ని రోజుల వరకు ఎలాంటి ఇబ్బందులు బయటపడని కరోనావైరస్‌ లాంటి వాటిని గుర్తించడానికి ఎలాంటి ఆన్‌లైన్‌ పరీక్షలు ఉపయోగపడవు. ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనిపిస్తే వైద్యులను సంప్రదించడమే ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు.