సెల్ఫీలు తీసి పంపితే బతికిపోయినట్టే.. లేదంటే : కర్నాటక ఏం చెబుతోంది?
కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో హోం (సెల్ఫ్) క్వారంటైన్‌లో వారందరికీ కర్నాటక ప్రభుత్వం అత్యంత కీలకమైన ఆదేశాలు జారీచేసింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోం క్వారంటైన్‌లలో ఉండేవారంతా ఖచ్చితంగా సెల్ఫీలు తీసి ప్రభుత్వానికి పంపాలంటూ ఆదేశాలు జారీచేసింది. అలా చేయని పక్షంలో ప్రభుత్వ క్వారంటైన్‌లకు తరలిస్తామని హెచ్చరించింది.
దీనికి కారణం లేకపోలేదు. హోం క్వారంటైన్‌లలో ఉండేవారిలో చాలా మంది నింబంధనలకు తూట్లుపొడిచి యధేచ్చగా తిరుగుతున్నారని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న వారు ప్రతి రోజు 14 సెల్ఫీలు పంపాలని ఆదేశించింది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల మధ్యలో సూచించిన నంబరుకు వీటని పంపాలని, నిద్రిస్తున్న సమయం ఇందుకు మినహాయింపని పేర్కొంది. ఇలా చేయని వారిని వెంటనే ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని హెచ్చరించింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెల్ఫీని షేర్ చేయాలంటే తొలుత జీపీఎస్‌ను ఆన్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. క్వారంటైన్‌లో ఉన్నవారు పంపే సెల్ఫీలను ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఆ ఫొటోల్లో తేడా ఉందని అధికారులు గుర్తిస్తే వెంటనే వారింటికి చేరుకుని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తారు.