బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (09:38 IST)

ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్లు : బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో కొత్తగా మరో రెండు జట్లు రానున్నాయి. ప్రస్తుతం ఎనిమిది జట్లు ఉన్న విషయం తెల్సిందే. ఈ రెండు కొత్త జట్లతో కలిసి మొత్తం 10 జట్లు కానున్నాయి. అలాగే, మ్యాచ్‌ల సంఖ్య కూడా 74కు పెరగనుంది. 
 
ఇందుకోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. కొత్త ఫ్రాంచైజీ ఒక్కో దానికి బేస్ ప్రైస్ రూ.2000 కోట్లు ఉండాలని నిర్ణయించారు. ఫలితంగా బీసీసీఐ ఈ రెండు జట్ల ద్వారా ఏకంగా రూ.5 వేల కోట్లకు పైనే ఆర్జించనుంది. 
 
నిజానికి కొత్త జట్ల బేస్ ప్రైస్‌ను తొలుత రూ.1700 కోట్లుగా నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత సవరించి రూ.2000 కోట్లుగా నిర్ణయించినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
 
10 లక్షల రూపాయలు చెల్లించి ఏ కంపెనీ అయినా బిడ్ పత్రాలను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, కనీసం రూ.3000 కోట్లు ఉన్న కంపెనీలు మాత్రమే బిడ్డింగ్‌‌లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తామని ఆ వర్గాలు తెలిపాయి. 
 
అయితే, కన్సార్టియంగా అంటే మూడు కంపెనీలు ఒక సంస్థగా ఏర్పడి కూడా బిడ్డింగ్‌లో పాల్గొనొచ్చని తెలిపింది. కానీ, మూడు కంటే ఎక్కువ కంపెనీలు మాత్రం ఒకటిగా ఏర్పడేందుకు అనుమతించే అవకాశం లేదు.
 
కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో, పూణెల నుంచి వచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, లక్నోలోని ఎకానా స్టేడియాల సామర్థ్యం ఎక్కువ కాబట్టి ఫ్రాంచైజీలు అటువైపే మొగ్గు చూసే అవకాశం ఉందని సమాచారం. 
 
అలాగే, అదానీ గ్రూప్, ఆర్‌పీజీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌తోపాటు ఫార్మా కంపెనీ టోరెంట్, ప్రముఖ బ్యాంకర్ కొత్త ఫ్రాంచైజీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.