చాంపియన్స్ ట్రోఫీ : పాక్ బౌలర్లను శతక్కొట్టిన కోహ్లీ.. భారత్ ఘన విజయం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దాయాది బౌలర్లను శతక్కొట్టాడు. తన బ్యాటింగ్ పరర్‌ను మరోమారు చూపించడంతో పాటు తన వ్యక్తిగతంగా అరుదైన రికార్డును అందుకున్నాడు. అలాగే, జట్టుకు అమూల్యమైన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ మళ్లీ ముందుండి ఛేజింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. అదేక్రమంలో అద్భుతమైన సెంచరీ చేశాడు. ఫలితంగా తన కెరీర్‌లో 51వ సెంచరీ సాధించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
కోహ్లీకి శ్రేయాస్ అయ్యర్ (56), గిల్ (46)లు తమవంతు సహకారం అందించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ (20), హార్దిక్ పాండ్యా (8)లు తక్కువ స్కోరుకే ఔట్ అయినప్పటికీ కోహ్లీ, గిల్, శ్రేయాస్‌లు పిచ్‌ను పూర్తిగా అర్థం చేసుకుని పరుగులు రాబట్టారు. ముఖ్యంగా, శ్రేయాస్, కోహ్లీకి పాకిస్థాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
క్రీజ్‌లో ఉన్నంతసేవు చక్కటి సమన్వయంతో ఆడారు. ముఖ్యంగా కోహ్లీ చాలా రోజుల తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్‌లతో ఆలరించాడు. అద్భుతమైన కవర్ డ్రైవ్‌లతో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. పాక్ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలివేయడం కూడా కోహ్లీకి కలిసివచ్చింది. పాక్ నిర్ధేశించిన 241 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ జట్టు 42.3 ఓవర్లలోనే సాధించింది.
అంతకుముందు పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసింది. కెప్టెన్ రిజ్వాన్ 46, షకీల్ 62లు మాత్రమే రాణించారు. మిగిలిన చేతులెత్తేయడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఈ క్రమంలో కుల్దీప్ 3, హార్దిక్ పాండ్యా 2, రాణా, జడేజా, అక్షర్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఇద్దరిని రనౌట్ చేసి పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను కోలుకోకుండా చేశాడు. ఈ టోర్నీలో భారత్ తన తదుపరి మ్యాచ్‌ను న్యూజిలాండ్ జట్టుతో మార్చి 2వ తేదీన ఆడనుంది.