బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 22 జూన్ 2017 (03:11 IST)

కుంబ్లేకి నీరాజనాలు.. కోహ్లీపై ఆగ్రహావేశాలు.. డైలెమ్మాలో బీసీసీఐ.. వినోద్ రాయ్ సీరియస్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన దూకుడుతో బీసీసీఐనే లోబర్చుకుని, బెదిరించి, ఒక ఉత్తమ వ్యక్తి, లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లేని అర్థంతరంగా కోచ్ పదవి నుంచి సాగనంపి ఉండవచ్చు కానీ యావత్ క్రీడా ప్రపంచ ఇవ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన దూకుడుతో బీసీసీఐనే లోబర్చుకుని, బెదిరించి, ఒక ఉత్తమ వ్యక్తి, లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లేని అర్థంతరంగా కోచ్ పదవి నుంచి సాగనంపి ఉండవచ్చు కానీ యావత్ క్రీడా ప్రపంచ ఇవ్వాళ అనిల్ కుంబ్లేకి మద్దతు పలుకుతూ కోహ్లీ అహంకారాన్ని తూర్పారబడుతోంది. గవాస్కర్ వంటి దిగ్గజ క్రికెటర్లు, మైఖేల్ బెవాన్ వంటి ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్లు అనిల్ కుంబ్లేకు సంపూర్ణ మద్ధతు ప్రకటించడమే కాకుండా కెప్టెన్‌ల కోసం కోచ్‌లను బలి చేయడం కూడదని సూచిస్తున్నారు. గవాస్కర్ అయితే కోచ్‌పై ఫిర్యాదు చేసినా సరే అలాంటి వారిని వెంటనే ఇంటికి పంపించేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన విజయాలనే కాదు. కోచ్‌గా తన చివరి అనూహ్య పరాజయాన్ని కూడా తేలిగ్గా తీసుకుని ఎవరినీ పల్లెత్తు మాట అనకుండా జెంటిల్‌మన్ గానే తప్పుకున్న అనిల్ కుంబ్లేకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, క్రికెట్ దిగ్గజాలు, నెటిజన్లు నీరాజనాలు అర్పిస్తున్నారు.
 
టీమిండియాలో విభేదాలు, కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా వంటి పరిణామాలపై దేశీయంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, క్రికెట్ దిగ్గజాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యంగ్యస్రాలు సంధిస్తున్నారు. భారత క్రికెటర్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా టీమిండియాలో నెలకొన్న విభేదాలపై ఒలింపిక్స్ స్వర్ణ విజేత, భారత షూటర్ అభినవ్ బింద్రా తనదైన శైలిలో స్పందించారు. అటు విమర్శలా కాకుండా, ఇటు వివాదాన్ని సమర్థిస్తున్నట్లూ కాక టీమిండియా తీరును ఎండగట్టారు. ఈ మేరకు ట్వీట్టర్‌లో బుల్లెట్ పేల్చాడు. పరోక్షంగా ఈ బుల్లెట్ నేరుగా టీమిండియా కెప్టెన్‌ కోహ్లీకే తాకింది.
 
అభినవ్ ట్వీట్ సారాంశం.. ఇదే.. ‘నా కెరీర్‌లో అత్యుత్తమ గురువు ఎవరైనా ఉన్నారంటే అది కోచ్ ఉవి. వాస్తవానికి ఆయనంటే నాకు అసహ్యం. అయినా సరే ఆయనతోనే 20 ఏళ్లు ప్రయాణం చేశాను. నాకు ఏదైతే నచ్చదో.. ఏదైతే వినకూడదనుకుంటానో.. ఉవి అదే చెప్పేవారు’ అని పేర్కొన్నాడు అభివన్ బింద్రా. 
 
అనిల్ కుంబ్లే కోచింగ్ శైలిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన వరుస పరిణామాలతో అనిల్ కుంబ్లే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన బింద్రా.. పై విధంగా ట్వీట్ చేసి పరోక్షంగా కోహ్లీపై విమర్శలు చేశారు.
 
ఇదిలాఉండగా, అభినవ్ వ్యాఖ్యలకు బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తజ్వాల మద్దతు పలికారు. ‘ట్రైనింగ్‌లో విభేదాలు సహజం. నా కోచ్ కూడా అలాగే చేసేవారు. ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.
 
అనిల్ కుంబ్లే రాజీనామా వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఏమీ ఎరగనట్లు, ఏమీ కానట్లు టీమిండియాను వెస్టిండీస్ పర్యటనకు పంపి, కుంబ్లేను ఇంటికి సాగనంపిన బీసీసీఐ తనపై కూడా విమర్శల నేపథ్యంలో డైలెమ్మాలో పడినట్లు తెలుస్తోంది.