గురువారం, 18 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (13:39 IST)

నరేంద్ర మోడీ స్టేడియంలోకి వచ్చిన శునకం.. హార్దిక్.. హార్దిక్ అంటూ దద్దరిల్లిన స్టేడియం!!

hardik - dog
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా, ఆదివారం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోగా, గుజరాత్ జట్టు విజయభేరీ మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై సారథి హార్దిక్ పాండ్యాకు దారుణ అవమానం జరిగింది. రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు సారథిగా హార్దిక్ పాండ్యా చేపట్టారు. దీన్ని ఆ జట్టు అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పాండ్యాను కించపరిచేలా ప్రవర్తిస్తున్నారు. మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుండగా ఒకానొక సమయంలో కుక్క ఒకటి మైదానంలోకి దూసుకొచ్చి, స్టేడియంలో పరుగులు పెట్టింది. 
 
ఈ శునకాన్ని చూసిన ప్రేక్షకులు.. హార్దిక్ హార్దిక్ అంటూ పెద్దగా అరుస్తూ పాండ్యాను అవమానపరిచే రీతిలో ప్రవర్తించారు. దీనికి సంభంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హార్దిక్ చేసిన నేరమేమిటని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పాండ్యాను కుక్కతో ఎందుకు పోల్చుతున్నారంటూ వారు నిలదీస్తున్నారు. అహ్మదాబాద్ అభిమానుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాండ్యాకు ముంబై జట్టుకి వెళ్లిపోవడంతో గుజరాత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకే ఇలాంటి నీచానికి దిగజారుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు హార్దిక్ పాండ్యాను వ్యతిరేకించడానికి గల ఒక్క కారణమైనా చెప్పగలరా అని ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.