శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (15:58 IST)

టీ20 ఫార్మాట్‌ అసలు ఓ క్రికెటే కాదు.. : మైఖేల్ హోల్డింగ్

వెస్టిండీస్ క్రికెట్ జట్టు గత 1979లో ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యుల్లో మైఖేల్ హోల్డింగ్ ఒకరు. మొత్తం 60 టెస్టులు, 102 వన్డేలు ఆడాడు. 391 వికెట్లు పడగొట్టాడు. అలాంటి మైఖేల్ హోల్డింగ్ టీ20 క్రికెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌ను అసలు తాను క్రికెట్‌గానే పరిగణించబోనన్నారు. టీ20 టోర్నీని గెలవడం పునరుజ్జీవం కాదని, ఎందుకంటే అది అసలు క్రికెట్టే కాదని తేల్చి చెప్పాడు. అస్సలు టీ20 ఫార్మాట్ క్రికెట్ కాదు కాబట్టే దానికి తాను కామెంటరీ చెప్పడం లేదని పేర్కొన్నాడు. 
 
అలాగే, తన దేశ క్రికెటర్లపై ఆయన స్పందిస్తూ, టెస్ట్ క్రికెట్‌లో విండీస్ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది విండీస్ ఆటగాళ్లు దేశం కోసం ఆడడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆరు వారాల్లో 8 లక్షల డాలర్లు వస్తున్నప్పుడు వారు మాత్రం ఏం చేస్తారని ప్రశ్నించాడు. తాను క్రికెటర్లను నిందించడం లేదని, నిర్వాహకులను మాత్రమే విమర్శిస్తున్నట్టు చెప్పాడు.
 
వెస్టిండీస్ జట్టు టీ20 టోర్నమెంట్లను గెలుస్తుందని, అయితే అది క్రికెట్ కాదన్నాడు. ఐపీఎల్‌కు ఎందుకు కామెంటరీ చెప్పడం లేదన్న ప్రశ్నకు హోల్డింగ్ బదులిస్తూ.. తాను క్రికెట్‌కు మాత్రమే కామెంటరీ చెబుతానని స్పష్టం చేశాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీని విండీస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో పోల్చిన హోల్డింగ్.. మైదానంలో కోహ్లీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సూచించాడు.