ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు అయితే...?
ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, సోమవారం భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. సూపర్-8 దశలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. మొత్తం ఐదు విజయాలతో టీమిండియా మంచి దూకుడు మీద ఉంది. సూపర్-8 దశలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచినా సెమీస్ బెర్త్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు అనూహ్య రీతిలో గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. ఈ కారణంగా అటు ఆసీస్.. ఇటు టీమిండియా జట్లకు సోమవారం నాటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితం ఒక సెమీస్ బెర్త్‌ని ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే, స్థానిక వాతావరణం మాత్రం భయపెడుతుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. మ్యాచ్ సమయంలో వాన పడే అవకాశం 40 శాతంగా ఉందని పేర్కొంది. ఒక వేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు సెమీస్ సమీకరణాలు ఆసక్తికరంగా మారతాయి. భారత్ మ్యాచ్ గెలిస్తే దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. పర్యావసానంగా మొత్తం ఐదు పాయింట్లతో టీమిండియా సెమీస్ అధికారికంగా అడుగుపెడుతుంది. ఈ సమీకరణంలో ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు మాత్రమే ఉంటాయి.
ఆసీస్ మూడు పాయింట్లకు పరిమితం అయితే.. ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఎన్ని పాయింట్లతో ఏ స్థానంలో నిలుస్తుందనే దాన్ని బట్టి రెండో సెమీస్ స్థానం ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్ తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధిస్తే నాలుగు పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఒకవేళ నేటి మ్యాచ్‌లో ఆసీస్ ఓడిపోతే జట్టు అవకాశాలు అత్యంత జటిలంగా మారతాయి.
ఇక టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టు గెలిస్తే నాలుగు పాయింట్లతో సెమీస్ రేసులో ఉంటుంది. ఇక బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్థాన్ కూడా గెలిస్తే ఈ రెండు జట్లు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్‌కు పోటీ పడనున్నాయి. భారత్ చేతిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోయిన సమీకరణంలో కూడా నెట్ రన్ రేట్ కీలకం కానుంది.