ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (20:21 IST)

కాసుల వర్షం కురిపించి ఐపీఎల్ ఈ యేడాది లేనట్టే : సునీల్ గవాస్కర్

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు మాత్రమే కాదు.. ఆయా ఫ్రాంచైజీలకు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ పోటీల నిర్వహణపై ఈ యేడాది ఆశలు వదులుకోవాల్సిందేనని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. 
 
ఆస్ట్రేలియాలోని స్టేడియాల్లో 25 శాతం ప్రేక్షకులతో మ్యాచ్‌లు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిన ప్రకటన ద్వారా భవిష్యత్తులో క్రీడాపోటీలు జరుగుతాయని సంకేతాలు ఇచ్చినట్టయిందన్నారు. కానీ, ఈ ప్రకటన వింటుంటే టీ20 వరల్డ్ కప్ జరుగుతుందన్న నమ్మకం కలుగుతోందని, ఇదే జరిగితే ఈ ఏడాది ఐపీఎల్ పై ఆశలు వదులుకోవాల్సిందేనని తెలిపారు.
 
అంతేకాకుండా, ఆస్ట్రేలియాలో అక్టోబరు నుంచి టీ20 వరల్డ్ కప్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఒకవేళ సెప్టెంబరులో ఐపీఎల్ జరపాలన్నా వీలు కాదని గవాస్కర్ స్పష్టం చేశారు. అక్టోబరులో ఆసీస్ గడ్డపై జరిగే టోర్నీ కోసం ఆయా జట్లన్నీ ఎంతో ముందుగా అక్కడికి వెళ్లి 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని, పైగా ప్రాక్టీసు మ్యాచ్‌లు, శిక్షణ శిబిరాలు తప్పవని వివరించారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబరు నుంచే మొదలైతేనే అక్టోబరులో ప్రపంచకప్ జరుగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌కు చోటెక్కడ వుందని సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. 
 
కాగా, కాసుల వర్షం కురిపించే ఈ పొట్టి క్రికెట్‌కు క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా మార్చి నెలాఖరులో ప్రారంభంకావాల్సిన ఈ టోర్నీని వాయిదావేశారు. అయితే, ఈ టోర్నీని ఎలాగైనా జరపాలని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పట్టుదలగా ఉన్నాడు. సెప్టెంబరులో కానీ, అక్టోబరులో కానీ జరపాలని, భారత్‌లో వీలుకాకుంటే శ్రీలంక సహా మరే విదేశీ గడ్డపై అయినా నిర్వహించాలని భావిస్తున్నాడు.
 
అయితే, అదేసమయంలో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఈ మెగా టోర్నీ వాయిదా పడితేనే ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది. ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కరోనా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో అలాంటి నిర్ణయాన్ని ఆస్ట్రేలియా సర్కారు తీసుకోకపోవచ్చని తెలుస్తోంది.