సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (17:04 IST)

వెల్లింగ్టన్ ట్వంటీ20 మ్యాచ్: పోరాడి ఓడిన భారత్ ... సిరీస్ కివీస్ కైవసం

వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు పోరాడి ఓడింది. 213 పరుగుల భారీ విజయలక్ష్యంలో బరిలోకి దిగిన టీమిండియా కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ ధోనీ కేవలం రెండు పరుగులకే ఔట్ కావడంతో భారత విజయకాశాలపై దెబ్బపడింది. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి కేవలం 4 రన్స్ తేడాతో ఓటమిని చూసింది. 

ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ (5) త్వరగా ఔటైనప్పటికీ మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం 32 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఈ ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. రోహిత్‌కు విజయ్ శంకర్ అద్భుతమైన సహకారం అందించాడు. విజయ్ 28 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్ల సాయంతో 43 పరుగులు చేశాడు. రోహిత్ ఔట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పంత్ (28).. విజయ్‌ శంకర్‌తో కలిసి, ఆ తర్వాత హెచ్.హెచ్ పాండ్యా (21)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చే దిశగా ప్రయత్నించారు. 
 
కానీ, మాజీ కెప్టెన్ ధోనీ మాత్రం కేవలం రెండు పరుగులు చేసి ఔట్ కావడంతో భారత్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే, మ్యాచ్ చివర్లో దినేష్ కార్తీక్ (33), కేహెచ్ పాండ్యా (26)లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ 145 పరుగుల నుంచి 208 పరుగుల వరకు జట్టు స్కోరును చేర్చారు. వీరిద్దరూ పోరాట పటిమ కారణంగా ఒక దశలో భారత్ విజయం సాధిస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 212 పరుగులు చేసిన విషయం తెల్సిందే. ఆ జట్టులో సీఫెర్ట్ 43, మున్రో 72, విలియమ్సన్ 27, గ్రాండ్‌హోం 30, మిచెల్19, టేలర్ 14 చొప్పున పరుగులు చేశాడు. ముఖ్యంగా, మున్రో చెలరేగి ఆడి 40 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో విజయం సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మున్రోకు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డను సీఫెర్ట్ దక్కించుకున్నాడు.