శనివారం, 16 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే

zimbabwe team
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, సూపర్-12 గ్రూపు-బిలో గురువారం పాకిస్థాన్, జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ అనూహ్యంగా ఓటమిపాలైంది. విన్నింగ్ రన్ తీస్తున్న బ్యాట్స్‌మెన్ రనౌట్ కావడంతో జింబాబ్వే జట్టు ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
ఇదిలావుంటే, తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేపట్టింది. అయితే, వారి అంచనాలను పాకిస్థాన్ బౌలర్లు తలకిందులు చేశారు. జింబాబ్వే బ్యాటర్లు పరుగులు చేయకుండా కట్టుదిట్టంగా లైన్ అండ్ లెగ్త్ ప్రకారం బౌలింగ్ చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
ఆ తర్వాత 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ (4)మరోమారు నిరాశపరిచాడు. అలాగే, రిజ్వాన్ (14), షాన్ మసూద్ (44)లు కొంతమేరకు రాణించారు. అయితే, 20వ ఓవర్ చివరి బంతికి మూడు పరుగుల చేస్తే విజయం పాకిస్థాన్ ఖాతాలో చేరిపోతుంది. అలాకాకుండా రెండు పరుగులు చేసినా మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్ దిశగా సాగుతుంది. 
 
కానీ, పాక్ బౌలర్ షహీద్ ఆఫ్రిది బంతిని కొట్టి ఓ పరుగు తీశాడు. రెండో పరుగు తీయలేక రనౌట్ అయ్యాడు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 129 పరుగులు మాత్రమే చేసి సింగిల్ పరుగుతో ఓటమి పాలైంది. గత ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ జట్టు చివరి బంతికి ఖంగుతిన్న విషయం తెల్సిందే.