గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

స్పిన్ వలలో చిక్కుకున్న చెన్నై విలవిల.. ఖాతాలో మరో ఓటమి

chennai super kings
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, గురువారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. స్పిన్ వలలో చిక్కున్న సీఎస్కే ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా 32 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ సీజన్‌లో సీఎస్కే జట్టుపై ఆర్ఆర్‌ జట్టుకు ఇది రెండో విజయం కావడం గమనార్హం. ఈ నెల 12వ తేదీన చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆర్ఆర్ జట్టు సీఎస్కే జట్టుపై పైచేయి సాధించింది. తాజా మ్యాచ్‌లోనూ గెలుపును సొంతం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన సీఎస్కే ఆర్ఆర్ జట్టు బ్యాటింగ్ చేపట్టి 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. యువ ఓపెనర్ జైస్వాల్ 77, ధృవ్ జురెల్ 34, దేవదత్ పడిక్కల్ 27 (నాటౌట్) చొప్పున పరుగులు చేయడంతో 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత 204 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటగట్టుకుంది. 
 
ఆ జట్టులో యువ ఆటగాడు శివమ్ దూబే ఒంటరి పోరాటం చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయాడు. దూబే 33 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 52 పరుగులు చేశాడు. మొయిన్ అలీ 12 బంతుల్లో 23 పరుగులు చేయగా, జడేజా 15 బంతుల్లో 23 చొప్పున రన్స్ చేశారు. ఓపెనర్ గైక్వాడ్ 47 పరుగులతో రాణించాడు. మిగిలిన ఆటగాళ్లలో అంబటి రాయుడు 0, ఓపెనర్ డెవాన్ కాన్వే 8, రహానే 15 చొప్పున పరుగులు చేశారు.
 
అయితే, ఆర్ఆర్ బౌలర్లు కీలక సమయాల్లో సీఎస్కే జట్టు వికెట్లను నేలకూల్చారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మూడు, అశ్విన్ రెండు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ చొప్పున తీసి తమ స్పిన్‌తో దెబ్బతీశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అగ్రస్థానానికి చేరుకోగా, అగ్రస్థానంలోఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానానికి పడిపోయింది.