శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 4 మార్చి 2017 (01:34 IST)

జిమ్‌కు వెళ్లడానికి కూడా శరీరం సహకరించలేదు.. రిటైర్ అవ్వక చస్తానా అన్న సచిన్

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకోవాలంటే ఫిట్ నెస్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనం పూర్తి ఫిట్ గా ఉన్నప్పుడే గేమ్‌పై దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ శరీరం అంతగా అనుకూలించడం లేదంటే ఇక ఆటకు దూరం

అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనకు తానుగా రిటైరయ్యాడా లేదా రిటైర్ కావాలని బీసీసీఐ తరపున ఎవరైనా ఒత్తిడి చేశారా? రిటైరైన నాలుగేళ్ల తర్వాత కూడా ఈ విషయం వివాదాలు రేకెత్తిస్తూనే ఉంది. భారత క్రికెట్ జట్టు సెలెక్టింగ్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ చెప్పిందాని ప్రకారం సచిన్ 2013లో రిటైర్ కాకపోయి ఉంటే బలవంతంగా జట్టులోంచి తప్పించేసి ఉండేవారిమని ఇటీవలే ప్రకటించి తీవ్ర విమర్శల పాలయ్యాడు కూడా. ఈ విషయంలో నిజానిజాలు సచిన్‌కే ఎరుకు. ఇన్నేళ్ల తర్వాత సచిన్ స్వయంగా తానెందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడో చెప్పేశాడు. జిమ్‌కు వెళ్లడానికి కూడా శరీరం సహకరించలేదు అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానన్నాడు. 

 
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకోవాలంటే ఫిట్ నెస్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనం పూర్తి ఫిట్ గా ఉన్నప్పుడే గేమ్‌పై దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ  శరీరం అంతగా అనుకూలించడం లేదంటే ఇక ఆటకు దూరంగా ఉండమని సంకేతాలు అందినట్లే. ఇదే పరిస్థితి మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కూడా ఎదురైందట. 2013 అక్టోబర్ నెలలో తన శరీరం, మనసు కూడా పూర్తిగా క్రికెట్ కు అనుకూలించడం మానేశాయట. ఒక్కసారిగా తనలో చోటు చేసుకున్న ఈ పరిణామానికి తొలుత కొంత ఆశ్చర్యపడినప్పటికీ, ఆ తరువాత క్రికెట్ కు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని విషయాన్ని తాను గ్రహించినట్లు సచిన్ తెలిపాడు.
 
ఇటీవల ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డిన్‌లో జాయిన్ అయిన సచిన్ తన అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. ' 2013 అక్టోబర్ లో చాంపియన్స్ లీగ్ ఆడుతున్న సమయంలో నాలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక రోజు జిమ్ కు వెళ్లేందుకు శరీరం సహకరించలేదు.. బలవంతంగా నిద్ర లేచాను.  నా 24 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఏ రోజూ శారీరక వ్యాయమం చేయకుండా ఉండలేదు. అటువంటిది ఉన్నట్టుండి జిమ్ చేయడానికి శరీరం సహకరించలేనట్లు అనిపించింది. అప్పుడే అనిపించింది ఇక అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని. ఆ క్రమంలోనే చాంపియన్స్ లీగ్ ఆడే మ్యాచ్ ల్లో లంచ్, టీ విరామాల్లో ఎంత సమయం నాకు అవసరం అవుతుందనే విషయాన్ని చెక్ చేసుకునే వాణ్ని. నా రిటైర్మెంట్ కు సమయం వచ్చేసిందని అప్పుడే అనిపించింది. 
 
అదే సమయంలో ప్రొఫెషనల్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి బిల్లీ జీన్ కింగ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. నువ్వు ఎప్పుడు రిటైర్ కావాలనేది ప్రపంచ నిర్ణయించకూడదు.. నువ్వే నిర్ణయించుకోవాలి అనే విషయం జ్ఞప్తికి వచ్చింది. దాంతోనే నా రిటైర్మెంట్ గురించి ఆలోచనలో పడ్డా. ఆ తరువాత నెలకి క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నా'అని సచిన్ పేర్కొన్నాడు.2013 నవంబర్  14వ తేదీన ముంబైలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా సచిన్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
 
ఆటలోనూ, వ్యక్తిగత ప్రవర్తనలోనూ చివరివరకు అత్యంత నిజాయితీగా వ్యవహరించిన సచిన్ టెండూల్కర్ మాటలను విశ్వసించాల్సిందే మరి. ఎందుకంటే మాట్లాడుతున్నది గాడ్ ఆఫ్ క్రికెట్ కదా.