సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జులై 2020 (17:43 IST)

కాసులకు కక్కుర్తిపడిన క్రికెట్ ఆస్ట్రేలియా - ఐపీఎల్‌ కోసమే టీ20 వాయిదా

క్రికెట్ ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐపీఎల్ కోసమే ఐసీసీ ట్వంటీ20ని వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. కరోనా పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ వాయిదాపడటం, ఆ టోర్నీ స్థానంలో యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. 
 
ఈ వ్యవహారంపై పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో స్పందించాడు. క్రికెట్‌లో ఆర్థిక సమానత్వం లేకుండా పోయిందని వ్యాఖ్యానించాడు. బీసీసీఐ ఆర్థికంగా బలోపేతమైనదికావడంతో గతంలో వచ్చిన మంకీగేట్ వివాదాన్ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా పట్టించుకోకుండా వదిలేసిందని ఆరోపించాడు. ఇప్పుడు కూడా బీసీసీఐకి అనుకూలంగా ఐపీఎల్ కోసమే టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేశారన్న కోణంలో వ్యాఖ్యలు చేశాడు.
 
'ఒకరు మరొకర్ని కోతి అని పిలుస్తారు. సిరీస్ నుంచి మధ్యలోనే వెళ్లిపోతామని ఓ జట్టు బెదిరిస్తుంది. ఆస్ట్రేలియన్లను నేనడుగుతున్నాను... ఏమైపోయాయి మీ నైతిక విలువలు? నిన్నగాక మొన్న బంతిని గీకారంటూ ఆటగాళ్లపై తీవ్ర చర్యలు తీసుకున్నారు, కోతి అన్నవాడ్ని వదిలేశారు. సిరీస్ బాయ్‌కాట్ చేస్తామని బీసీసీఐ బెదిరించగానే, అసలు అలాంటి సంఘటనే జరగలేదంటూ తేల్చేశారు. 
 
ఇదేనా మీ నైతిక ప్రవర్తన? ఇకనైనా ఈ డ్రామాలు కట్టిపెట్టండి, మాకు డబ్బే ముఖ్యమని చెప్పుకోండి. బీసీసీఐ నుంచి డబ్బు జాలువారుతుంటే క్రికెట్ ఆస్ట్రేలియా చక్కగా ఒడిసిపట్టుకుంటోంది. టి20 వరల్డ్ కప్‌ను జరగనివ్వరని నేను ముందే చెప్పాను. వరల్డ్ కప్ ఏమైపోయినా ఫర్వాలేదు కానీ, ఐపీఎల్ కు మాత్రం నష్టం జరగకూడదు!' అంటూ అక్తర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.