సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (10:33 IST)

మరికొన్ని గంటల్లో తేలనున్న టీ-20 ప్రపంచ కప్ భవితవ్యం?

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అనేక అంతర్జాతీయ క్రీడా సంగ్రామాలు వాయిదాపడుతున్నాయి. తాజాగా ఐసీసీ నిర్వహించే ట్వంటీ-20 ప్రపంచ కప్ భవితవ్యం కూడా మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ టోర్నీకి ఆతిథ్యం వహించాల్సిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టోర్నీని తాము నిర్వహించలేమని చేతులెత్తేసింది. ఇదే అభిప్రాయంతోనే ఐసీసీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ నిర్వహణపై ఐసీసీ సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. 
 
మరోవైపు, ఐసీసీ నిర్ణయంపైనే ఐపీఎల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచకప్ సాధ్యం కాదన్న విషయాన్ని కనుక ఐసీసీ తేల్చేస్తే అదేసమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఉన్నంతకాలం ఈ విషయం పడనీయలేదు. ఇప్పుడాయన లేకపోవడంతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమైనట్టేనని చెబుతున్నారు.
 
ఇంకోవైపు, శశాంక్ మనోహర్ స్థానంలో తదుపరి ఛైర్మన్‌ను ఎన్నుకునే నామినేషన్ల ప్రక్రియ పైనా సోమవారం చర్చించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కొలిన్ గ్రేవ్ ఛైర్మన్ రేసులో ఇప్పటికే నిలవగా, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేరు వినిపిస్తున్నప్పటికీ కొన్ని అడ్డంకులు దాదాను అడ్డుకుంటున్నాయి.