సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 మే 2020 (16:34 IST)

ఐపీఎల్ నిర్వహణపై కేంద్రానిదే తుది నిర్ణయం : కిరణ్ రిజిజు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీల నిర్వహణపై తుది నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖా మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. మార్చి నెలలో ప్రారంభంకావాల్సిన ఈ ఐపీఎల్ పోటీలు కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన విషయం తెల్సిందే. 
 
అసలు ఈ యేడాది ఐపీఎల్ పోటీలు స్వదేశంలో నిర్వహిస్తారా లేదా విదేశాల్లో నిర్వహిస్తారా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో వర్షాకాలం తర్వాత ఐపీఎల్ పోటీలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ జోహ్రీ ఇటీవల వ్యాఖ్యానించారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, ఐపీఎల్ ఎప్పుడు జరపాలో నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అని, బీసీసీఐ కాదని స్పష్టం చేశారు. అది కూడా దేశంలో కరోనా పరిస్థితుల ఆధారంగానే కేంద్రం నిర్ణయం ఉంటుందని అన్నారు. 
 
ప్రజల ఆరోగ్యానికి ముప్పు లేదని భావించినప్పుడే కేంద్రం ఐపీఎల్ కు ఆమోదం తెలుపుతుందని తెలిపారు. కీడ్రా పోటీలు నిర్వహించడం కోసం దేశ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమ దృష్టంతా కరోనాతో పోరాడడంపైనే ఉందని వెల్లడించారు.