మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:00 IST)

ఐపీఎల్‌-2020 నిరవధిక వాయిదా.. బీసీసీఐ ప్రకటన

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఈ ఏడాది కరోనా కారణంగా జరుగుతుందా లేదా అనే దానిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కరోనా విజృంభించడంతో ఐపీఎల్‌-2020 నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది ఐపిఎల్‌ మార్చి 29నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్‌-19 కారణంగా 21 రోజుల లాక్‌డౌన్‌తో ఈ టోర్నీని ఏప్రిల్‌ 15వరకూ తొలిసారి వాయిదా వేశారు. 
 
మంగళవారం ప్రధాని లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 'ఐపిఎల్‌ నిరవధిక వాయిదా గురించి బోర్డు మాకు సమాచారమిచ్చింది. పరిస్థితులు సద్దుమణిగాక ఈ ఏడాది చివర్లోనైనా విండో లభిస్తుందని ఆశిస్తున్నాం' అని ఓ ఫ్రాంచైజీ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.
 
కాగా.. 2008లో ఐపిఎల్‌ ఆరంభమయ్యాక ఏప్రిల్‌-మే విండోను కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే సెప్టెంబర్‌లో ఐపిఎల్‌ను ఆడిస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌ ఐపిఎల్‌పై మే 3 తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.