శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (13:34 IST)

ఇంగ్లండ్‌పై ఘన విజయం: రెండో స్థానానికి ఎగబాకిన భారత్

చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీమోగించింది. ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్‌లో టీమిండియా ఏకంగా రెండోస్థానానికి ఎగబాకింది. 
 
చెన్నైలో ఇంగ్లండ్‌పై గెలిచి 4 టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసిన కోహ్లీ సేన వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి దిగజారింది. 
 
ప్రస్తుత పాయింట్ల మేరకు న్యూజిలాండ్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. మరో బెర్తు కోసం భారత్, ఇంగ్లండ్ మధ్య గట్టిపోటీ నెలకొంది. భారత్ జట్టు ఈ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరాలంటే సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. 
 
ఇంగ్లండ్‌కు కూడా ఇదే సమీకరణం వర్తిస్తుంది. ఈ సిరీస్‌ను టీమిండియాగానీ, ఇంగ్లండ్గానీ 3-1 తేడాతో గెలిస్తే, గెలిచిన జట్టు ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అలాకాకుండా 2-2తో గానీ, 1-1తో గానీ సిరీస్ సమం అయినా, 2-1తో ఇంగ్లండ్ గెలిచినా... భారత్, ఇంగ్లండ్ జట్లలో ఏ ఒక్కటీ ఫైనల్ చేరకపోగా.... ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. 
 
ఇంగ్లండ్‌పై ప్రతీకార విజయం.. 
చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో 4 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ సమమైంది. ఇదే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ తొలి టెస్టులో ఎదురైన దారుణ ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకుంది. 
 
స్పిన్ పిచ్‌పై ఇంగ్లండ్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్న‌ర్లు.. 317 ప‌రుగుల భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయ‌గా.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టామ్ స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ 5 వికెట్లు తీయ‌డం విశేషం. 
 
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 134 ప‌రుగుల‌కు ఆలౌటైన ఇంగ్లండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 164 ప‌రుగుల‌కే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో చివ‌ర్లో మెరుపులు మెరిపించిన మోయిన్ అలీ 43 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 
 
మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీయ‌డంతో పాటు సెంచ‌రీ చేసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ప‌రుగుల ప‌రంగా టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో టీమిండియాకు ఇది ఐదో భారీ విజ‌యం కావ‌డం విశేషం.
 
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 286 రన్స్ చేసింది. అలాగే, ఇంగ్లండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 134 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 164 రన్స్ చేసి ఓటమి పాలయ్యారు.