అడిలైడ్‌లో కరోనా కలకలం.. స్వీయ నిర్బంధంలోకి ఆసీస్ ఆటగాళ్లు!
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ రెండు జట్ల మధ్య డిసెంబరు 17వ తేదీన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అయితే, తొలి టెస్ట్ మ్యాచ్ జరిగే అడిలైడ్‌లో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత రెండు మూడు రోజులుగా మళ్ళీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆసీస్ ఆటగాళ్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. వీరిలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో పాటు.. మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు.
దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. భారత్ - ఆసీస్ మధ్య అక్కడ డిసెంబరు 17వ తేదీ నుంచి జరుగాల్సిన డే అండ్ నైట్ టెస్టు షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ప్రకటించింది. అడిలైడ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా సహా కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కావడంతో దక్షిణ ఆస్ట్రేలియా నుంచి రవాణాను ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే, పర్యాటకులకు 14 రోజుల క్వారంటైన్‌ను మళ్లీ తప్పనిసరి చేసింది.
ఇదిలావుంటే, భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ళందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో సభ్యులందరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. అయినప్పటికీ సిడ్నీలో క్వారంటైన్‌తో కూడిన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఆసీస్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. కాగా డిసెంబర్ 17 నుంచి జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించాలని సీఏ నిర్ణయించిన సంగతి తెలిసిందే.