ఆదివారం, 10 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (11:55 IST)

ఆస్ట్రేలియా పర్యటనలో అత్యంత హీనంగా చూశారు : శార్దూల్ ఠాకూర్

shardul thakur
భారత క్రికెట్ జట్టు యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్ సంచలన విషయాలను వెల్లడించారు. గత 2020-21 సీజన్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో తమకు ఎదురైన అనుభవాలను ఆయన బహిర్గతం చేశారు. ఆ పర్యటనలో అనేక మంది టీమిండియా ఆటగాళ్లు గాయాలబారిన పడినా, భారత జట్టు అద్భుతమైన పోరాటపటిమ చూపి టెస్టు సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుందని గుర్తు చేశారు. అయితే, ఆ సిరీస్ తొలి టెస్టులో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలడంతో, మిగిలిన టెస్టుల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తాయని అందరూ భావించారు. 
 
కానీ భారత జట్టు అద్భుతంగా పుంజుకుని సిరీస్ విజేతగా నిలిచిందని చెప్పారు. ముఖ్యంగా, కంగారులను వారి సొంతగడ్డపైనే చిత్తుగా ఓడించినట్టు గుర్తు చేశారు. ఈ విజయంలో శార్దూల్ ఠాకూర్ కూడా తన వంతు పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. 
 
 
 
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న శార్దూల్ ఠాకూర్.. ఆ పర్యటనలో తమకు ఎదురైన అనుభవాలను వివరించారు. మైదానం వెలుపల తమకు ఎంతో కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయని, సరిగ్గా చెప్పాలంటే దారుణమైన అనుభవాలు చవిచూశామని చెప్పాడు. 
పర్యటనపై అప్పటికే నీలినీడలు కమ్ముకుని ఉంటే, 14 రోజుల క్వారంటైన్ విధిస్తామంటూ క్వీన్స్ లాండ్ ప్రభుత్వం బెదిరించిందని వెల్లడించాడు. తాము బస చేసిన హోటల్‌లో నాలుగైదు రోజుల పాటు గదిని శుభ్రం చేసేవాళ్లు కాదని, బెడ్ షీట్లు మార్చుకుందామంటే ఐదారు ఫ్లోర్లు పైకి ఎక్కాల్సి వచ్చేదని శార్దూల్ ఠాకూర్ వివరించాడు.
 
 
 
'ఆ తర్వాత సిడ్నీ నుంచి బ్రిస్బేన్ వెళ్లాం... అక్కడ క్వీన్స్‌లాండ్ రాష్ట్రానికి ఓ లేడీ గవర్నర్ ఉన్నారు. ఇక్కడికి మీరెందుకొచ్చారు? అన్నట్టుగా ఆమె చాలా కఠినంగా మాట్లాడారు. భారతీయులకు ఆతిథ్యం ఇవ్వడానికి మేం సిద్ధంగా లేం... వారికి ఆతిథ్యమివ్వడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు' అని ఠాకూర్ సంచలన విషయాలను వెల్లడించారు. 
 
 
 
'ఆ సిరీస్‌లో మమ్మల్ని ఒత్తిడికి గురిచేయడానికి అనేక ప్రతికూల అంశాలను తెరపైకి తెచ్చారు. ఆ సిరీస్‌లో ఆసీస్ కెప్టెన్‌గా ఉన్న టిమ్ పైన్ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. కానీ ఆ సిరీస్‌లో నేను ఆడాను కాబట్టి నిజానిజాలేంటో నాకు తెలుసు. 
 
విరాట్ కోహ్లి సిరీస్ మధ్యలో వెళ్లిపోయాక, అజింక్యా రహానే జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ సిరీస్‌లో మాకు కావాల్సినవి సాధించుకోవడం కోసం రహానే, జట్టు కోచ్ రవిశాస్త్రి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో ఒక పోరాటమే చేశారు' అని శార్దూల్ ఠాకూర్ వెల్లడించాడు.