1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

దీపావళి రోజు ఇంటి దీపాన్ని ఆర్పేశాడు... ఎక్కడ?

murder
ఓ కిరాతకుడు దీపావళి రోజే తన ఇంటి దీపాన్ని ఆర్పివేశాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్‌ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన ఏ.స్రవంతి(22), సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ శ్రీగిరిపల్లికి చెందిన కారు డ్రైవర్‌ మహేందర్‌లు 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 
 
ప్రస్తుతం వారికి మూడేళ్ల కుమార్తె ఉంది. వీరు ఏడాది క్రితం ఉప్పల్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లోని కందిగూడలో ఉండగా.. మహేందర్‌ ఓ కేసులో జైలుకెళ్లాడు. స్రవంతి భర్తను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చింది. అందుకైన ఖర్చు విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. అనంతరం వారు నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని సమతానగర్‌కు మారారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, గొడవలు చోటుచేసుకోవడంతో స్రవంతి చాలా రోజులుగా తల్లిగారి ఇంటి వద్దే ఉంటుంది. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి మహేందర్‌ భార్యకు ఫోన్‌ చేసి ఆదివారం ఇళ్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం సమతానగర్‌లో అద్దె ఇంటికి వెళ్లి చూడగా భర్త తన వస్తువులు తీసుకొని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మహేందర్‌ స్రవంతి ముఖంపై, తలపై బలంగా కొట్టాడు. ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది.
 
ఆ తర్వాత ఆమె మెడకు చున్నీ చుట్టి ఈడ్చుకెళ్లి మంచం కింద దాచాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. చెల్లి, బావ ఏమైనా గొడవ పడుతున్నారా అని స్రవంతి అన్న ప్రశాంత్‌ ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నరకు అక్కడికి చేరుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉంది. అనుమానంతో తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడటంతో ఆమె మృతి చెంది ఉంది. పోలీసులు మహేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దారుణం దీపావళి పండుగ రోజే జరగడం గమనార్హం.