శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 జులై 2023 (12:07 IST)

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనీ... కన్నబిడ్డను చంపేసిన కసాయి తల్లి.. ఎక్కడ?

murder
పరాయి పురుషుడితో పెట్టుకున్న అక్రమ సంబంధాని అడ్డుగా ఉందని భావించిన కన్నబిడ్డను ఓ కసాయి తల్లి చంపేసింది. పైగా నిద్రలోనే కన్నుమూసిందంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, ఆమె ప్రవర్తే పోలీసులకు పట్టించింది. ఈ దారుణం కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది. తాజాగ వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కుషాయిగూడ మార్కెట్ వద్ద నివాసం ఉండే నాయక్వాడి రమేష్ కుమార్ ఆటో డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన రాజబోయిన కల్యాణి (22)ని ప్రేమించి 2018లో  వివాహం చేసుకున్నాడు. కళ్యాణిది జనగామ జిల్లా నర్మెట్ట స్వగ్రామం. ఏడాదికే దంపతులకు కుమార్తె తన్విత (నాలుగున్నరేళ్లు) పుట్టింది. తర్వాత కల్యాణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. 
 
భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండేది. 2021 ఫిబ్రవరి నుంచి దంపతులు వేరుగా ఉంటున్నారు. కల్యాణి కూతురు తన్వితతో కలిసి కుషాయిగూడలోని పుట్టింట్లో ఉంటోంది. కూరగాయల మార్కెట్లో పనిచేస్తూ కూతురిని స్థానిక ప్రైవేటు స్కూల్లో చదివిస్తోంది. దూరపు చుట్టమైన జనగామ జిల్లా బచ్చనపేట మండలం నారాయణపూర్‌కు చెందిన ఇండ్ల నవీన్ (19)తో ఉన్న పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది.
 
భర్తకు విడాకులు ఇచ్చాక వివాహం చేసుకోవాలని వీరిద్దరూ భావించారు. ఇందుకోసం తన్వితను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు. అందులో భాగంగా నెల ఒకటో తేదీన శనివారం మధ్నాహ్నం స్కూల్ నుంచి వచ్చి భోజనం చేసిన చిన్నారిని తల్లి కల్యాణి మంచంపై పడుకోబెడుతున్నట్లు నటిస్తూ దిండును ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. 
 
ఈసీఐఎల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న ఆమె తల్లి రేణుక సాయంత్రం వచ్చిచూసే సరికి మనుమరాలిలో కదలిక లేకపోవడం గమనించగా.. పడుకుందంటూ తల్లితో బుకాయించింది. తర్వాత కూతురికి ఆరోగ్యం బాగోలేదని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లి నిద్రపోయిన తన కూతురు లేవడం లేదని, బతికించాలని వైద్యులను బతిమాలుతూ నటించింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
అయితే, కూతురి మృతికి తన భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నెల 2న రమేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపట్టి సాంకేతిక ఆధారాలను సేకరించారు. కల్యాణిని విచారించగా నేరం అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన దిండుతో పాటు రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. ఆమెతోపాటు ప్రియుడు నవీన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు.