శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: బుధవారం, 6 అక్టోబరు 2021 (15:59 IST)

100 కోట్లకు ఐపి, పరారీలో కుటుంబం, ఎక్కడంటే?

చీటీలు వేశాడు. అందరికీ కరెక్టుగా డబ్బులు ఇస్తున్నాడు. నమ్మకంగా డబ్బులు కట్టడం ప్రారంభించారు. అలా ఒక గ్రామానికి చెందిన వారే కాదు.. ఏకంగా ఒక మండలానికి చెందిన గ్రామస్తులే అతన్ని నమ్మారు. చీటీలు వేస్తూ డబ్బులు కరెక్టుగా వస్తుండటంతో ఎంతో నమ్మకంతో అతనికి అందరూ దగ్గరయ్యారు. దీన్ని అదునుగా భావించి కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు ఐపి పెట్టి పారిపోయాడు.
 
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలోని పాండురంగయ్య శెట్టి, ఆయన మనవడు ప్రవీణ్‌లు మండల పరిధిలోని 900 మందికి పైగా చీటీల రూపంలో డబ్బులు వసూలు చేసి పారిపోయారు. వీరు బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవారు. చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు బట్టలను పంపుతూ బాగా డబ్బులు  సంపాదించేవారు.
 
దీంతో వీరి కుటుంబం చీటీలను ప్రారంభించారు. గత 20 సంవత్సరాలుగా వీరి కుటుంబం చీటీలను వేస్తోంది. లక్షల్లోనే చీటీలు ఉన్నాయి. ఒకే గ్రామంలోనే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు నమ్మి వీరి వద్ద చీటీలు వేయడం ప్రారంభించారు. ఇలా చీటీలను వేస్తూ కరెక్టుగానే డబ్బులను ఇచ్చేవారు ప్రవీణ్ కుటుంబం.
 
ఇలా నమ్మకంలో ఉన్నవారు గత రెండురోజుల క్రితం ఊరు వదిలి వెళ్ళిపోయారు. చీటీలతో పాటు కొంతమంది దగ్గర వ్యక్తిగతంగా చేసిన అప్పులు, తమ ఆస్తులను కూడా వేరే వ్యక్తులకు అమ్మేసి మరీ పారిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇదంతా జరిగింది. 
 
ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఎవరూ గ్రామంలో లేరు. ఇంటికి తాళాలు వేసేశారు. ఇంటిని వేరేవారికి విక్రయించేశారు. దీంతో మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ప్రస్తుతం నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు చిత్తూరు పోలీసులు.