బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (10:45 IST)

బీజేపీ పాలన సరిగా లేదనీ.. గుండు గీయించుకున్న బీజేపీ ఎమ్మెల్యే..

సాధారణంగా తమ సొంత పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వం చేసే తప్పులు ఆ పార్టీ నేతలకు కనిపించవు. కానీ, ఈయన రూటే సెపరేటు. తమ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలకుల పాలన సరిగా లేదని ఆక్షేపించారు. అంతటికో ఊరుకోకుండా తమ పార్టీ ప్రభుత్వ పాలనకు నిరసగా ఏకంగా గుండు గీయించుకున్నారు. ఈ ఘటన త్రిపురలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తను పరిశీలిస్తే, బీజేపీ సీనియ‌ర్ నేత‌ ఆశీష్ దాస్ త్రిపుర‌లోని సుర్మా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన రాష్ట్రంలో బీజేపీ పాల‌న స‌రిగా లేద‌ని, ఆ పార్టీ చేసిన త‌ప్పుల‌కు తాను గుండు గీయించుకున్న‌ట్లు చెప్పారు. ఆయన ప్రకటించినట్టుగానే కోల్‌క‌తాలోని కాళీఘ‌ట్ ఆల‌యానికి వెళ్లి త‌న త‌లనీలాల‌ను అర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్రిపుర‌లో బీజేపీ రాజ‌కీయ అరాచ‌కానికి పాల్ప‌డుతోంద‌ని, గంద‌ర‌గోళం సృష్టిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ పాల‌న ప‌ట్ల త్రిపుర ప్ర‌జ‌లు సంతోషంగా లేర‌ని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఆ పార్టీని వీడుతున్న‌ట్లు చెప్పారు. 
 
అయితే ఆశిష్ దాస్ త్వ‌ర‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల భ‌వానీపూర్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఆశిష్ సంతోషం వ్య‌క్తం చేశారు. దీంతో అత‌ను పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.