శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (07:58 IST)

ద్రవ్యోల్బణం విపత్తుగా మారితే తినడం - తాగడం మానేయండి : బీజేపీ ఎమ్మెల్యే

చత్తీస్‌ఘర్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్ మోహన్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో నానాటికీ ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై బ్రిజ్ మోహన్ అగర్వాల్ తనదైనశైలిలో స్పందించారు. దేశంలో ద్రవ్యోల్బణం విపత్తు స్థాయికి చేరితే తినడం, తాగడం మానేయ్యాలని కోరారు. 
 
అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో తాను సరదాగా అన్న మాటలను వక్రీరిస్తున్నారని మాట మార్చారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేయగా, దానిపై స్పందన ఏంటని అగర్వాల్‌ను ప్రశ్నించగా పైవిధంగా వ్యాఖ్యానించారు.
 
'ద్రవ్యోల్బణం జాతీయ విపత్తు స్థాయికి పెరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంత తీవ్ర స్థాయిలో ఉంటే తినడం, తాగడం ఆపేయండి. అలాగే పెట్రోల్ వాడకం కూడా ఆపేయండి. కాంగ్రెస్ ఏదో అద్భుతాలు చేస్తుందని ప్రజలు ఓటేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ద్రవ్యోల్బణం ఎలా పెరిగిందో అలాగే తగ్గుతుంది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అంటూ అగర్వాల్ వ్యాఖ్యానించారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే అగర్వాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా స్పందిస్తూ 'దేశం కష్టాల్లో ఉంటే, ఎమ్మెల్యే హేళన చేస్తున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు' అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.