శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (15:09 IST)

దేశ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు

గత రెండు రోజుల క్రితం నైరుతి రుతపవనాలు కేరళను తాకాయి. ఈ రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. 
 
కేరళలోని మిగిలిన భాగాలు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వివరించింది.
 
కాగా, రేపటికి అరేబియా తీరం మొత్తం వ్యాపించడమే కాకుండా, ఏపీలోని రాయలసీమ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. సాధారణంగా మహారాష్ట్రకు జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నెల 11న రుతుపవనాలు మహారాష్ట్రను తాకుతాయని ఐఎండీ తెలిపింది. 
 
ఇదిలావుంటే, తెలంగాణా నుంచి దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 
 
వాతావరణంలో ఏర్పడబోయే మార్పుల కారణంగా మదురై, తేని, దిండుగల్‌, తిరుచ్చి, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, నామక్కల్‌, తిరుపత్తూర్‌, వేలూరు జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వారు పేర్కొన్నారు. 
 
అలాగే, రానున్న 48 గంటల్లో నీలగిరి, కోయంబత్తూర్‌, ఈరోడ్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌, విరుదునగర్‌, పెరంబలూర్‌, అరియలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, రాణిపేట, తిరువళ్లూర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని, అదే విధంగా పుదుచ్చేరి, కారైకాల్‌ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. 
 
డెల్టా జిల్లాల్లో ఈదురుగాలులతో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నైలో పొడి వాతావరణం నెలకొనివుంటుందని, అత్యధికంగా 38, కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతాయని, సాయంత్రం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.