శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (12:34 IST)

వాక్సినేషన్‌కు బైక్, బిర్యానీ.. అంతేగాకుండా లక్కీ డ్రా కూడానూ..!

కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు జనాలు జడుసుకుంటున్నారు. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ లో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురుచూశారు. సెకండ్ వేవ్ సమయానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోడానికి ఆసక్తి చూపలేదు. ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయపడుతూనే ఉన్నారు. వారికోసమే ఓ స్వచ్ఛంద సంస్థ భారీ అఫర్ ప్రకటించింది.
 
తమిళనాడు రాష్టంలోని చెన్నై శివారులో కోవళం అనే ఓ మత్య్సకారుల గ్రామం ఉంది. ఇక్కడ జనాభా 14,300 కాగా వీరిలో 18 సంవత్సరాలు పైబడిన వారు 6,400 మంది. వీరిలో కేవలం 58 మంది మాత్రమే టీకా తీసుకోగా మిగతా వారికి కరోనా టీకాపై భయాందోళనలు నెలకొన్నాయి. వైద్యాధికారులు ఈ ప్రాంతంలో ప్రజలకు నచ్చజెప్పాలని చూసినా వారు అపోహలు వీడలేదు. దీంతో ఎలాగైనా వారిలో మార్పు తీసుకురావాలని భావించిన అదే ప్రాంతానికి చెందిన ఎస్ఎస్‌ రామ్‌దాస్‌ ఫౌండేషన్‌, ఎస్‌టిఎస్‌ ఫౌండేషన్‌, చిరాజ్‌ ట్రస్టు ఓ వినూత్న ఆఫర్ ప్రకటించింది.
 
టీకాపై ఒక లక్కీ డ్రా ఏర్పాటు చేసిన ట్రస్టు.. టీకా వేయించుకున్న వారికి బహుమతులు ఇవ్వడం ప్రారంభించింది. ముందుగా బిర్యానీతో ప్రారంభించిన ఈ లక్కీ డ్రా తర్వాత ఎక్కువ మందిని ఆకర్షించాలని మిక్సీ, గ్రైండర్, రెండు గ్రాముల బంగారం చొప్పున వారానికి మూడు బహుమతులు ఇస్తున్నారు. 
 
అంతేకాదు అందరికీ వ్యాక్సిన్ పూర్తయ్యాక లక్కీ డ్రా తీసి.. అందులో విజేతలకు రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, స్కూటర్‌లను బంపర్‌ ప్రైజ్‌గా అందిస్తామని ప్రకటించారు. ఆఫర్లు ప్రకటించిన తర్వాత ఇప్పటికి 345 మంది వ్యాక్సిన్ తీసుకోగా మరో వారం రోజులలో మిగతా వారిని ఒప్పించి వ్యాక్సిన్ అందిస్తామని స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నాయి.