Greeshma case judgement, ప్రియుడిని గడ్డి మందుతో చంపేసిన ప్రియురాలు: ఉరిశిక్ష విధించిన కేరళ కోర్టు
Greeshma case judgement తనకు గొప్పింటి వరుడు వచ్చాడనీ, తన ప్రియుడిని గడ్డిమందును కలిపిన డ్రింక్ ఇచ్చి చంపేసిన ప్రియురాలికి కేరళ కోర్టు ఉరి శిక్ష విధించింది. తను చదువుతున్న కళాశాలలో తనకు జూనియర్ అయిన యువకుడిని ప్రేమించిన గ్రీష్మ అనే యువతి అతడితో ఏడాది కాలం ప్రేమాయణం సాగిస్తూ వచ్చింది. ఐతే ఆమె తండ్రి ఓ ఆర్మీ ఆఫీసరును వరుడిగా నిర్ణయించి నిశ్చితార్థం జరిపించారు.
ఈ సమయంలో తన ప్రేమ విషయం బయటపెట్టకపోగా... తామిద్దరం ఏకాంతంగా వున్న సమయంలో అతడు తీసిన ఫోటోలను కాబోయే భర్తకు చూపిస్తాడన్న భయంతో తన ప్రియుడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. దాంతో అతడి హత్యకు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు ఆయుర్వేదిక్ జ్యూస్ లో గడ్డి మందు కలిపి అతడితో తాగించింది. ఫలితంగా అతడు మృత్యువాత పడ్డాడు.
ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన తిరువనంతపురం 586 పేజీల తీర్పును వెలువరించింది. తనను ప్రేమించిన వ్యక్తిని నిందితురాలు దారుణంగా మోసం చేయడమే కాకుండా అతడిని హత్య చేసిందని, ఇది సమాజానికి మంచి సందేశం ఇవ్వబోదని వెల్లడించింది. కనుక ఆమె వయసును పరిగణనలోకి తీసుకోలేమనీ, ఆమె చేసిన నేరానికి మరణశిక్ష సరైనదంటూ నెయ్యంట్టికర అదనపు సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
గ్రీష్మ లవ్ స్టోరీ ఏంటి?
టీనేజ్ వయసులో వుండగా తను చదువుకునే కాలేజీలో తన జూనియర్ యువకుడితో ప్రేమలో పడింది ఆమె. అలా వారి ప్రేమాయణం సాగుతుండగానే యువతి తండ్రి ఆమెకి ఓ ఆర్మీ ఆఫీసరుతో నిశ్చితార్థం చేసారు. ఆమె ఆ నిశ్చితార్థాన్ని సమ్మతించడంతో పాటు తన జూనియర్ తో ప్రేమాయణం కూడా సాగించింది. ఐతే పెళ్లి ఘడియలు సమీపించడంతో తన ప్రియుడిని ఎలాగైనా వదిలించుకోవాలన్న ఉద్దేశంతో అతడికి ఆయుర్వేదిక్ మందులో గడ్డి మందు కలిపి తాగించింది. దాంతో అతడు మృతి చెందాడు.
పూర్తి వివరాలను చూస్తే... కన్యాకుమారికి చెందిన గ్రీష్మ అనే యువతి తిరువునంతపురంకు చెందిన షారోజ్ రాజుతో 2021 నుంచి స్నేహంగా వుంటూ వస్తోంది. షారోజ్ రాజు ఆమెకి జూనియర్. ఐతే వీరి ఫ్రెండ్ షిప్ కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇదిలా సాగుతుండగానే గ్రీష్మ తండ్రి ఆమెకి ఆర్మీ అధికారితో వివాహం చేయాలని నిశ్చయించి విషయాన్ని తన కుమార్తెతో చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించింది. కానీ అప్పటికే తనతో ప్రేమాయణం సాగిస్తున్న రాజును అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా అనుమానం రాకుండా ఎలా హత్య చేయాలన్న విషయాలను ఆన్లైన్లో వెతికింది. అలా ఒకసారి అతడికి పండ్ల రసంలో నిద్రమాత్రలను కలిపి తాగించింది.
కానీ అతడికి ఏమీ కాలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని 2022 అక్టోబరు 14న రాజుని తన ఇంటికి పిలిచింది. అతడికి ఆయుర్వేదిక మెడిసిన్ అంటూ అందులో గడ్డి మందు కలిపి ఇచ్చింది. అది చేదుగా వుండటంతో రాజు ప్రశ్నించాడు. ఐతే అది ఆయుర్వేద మందు కనుక అలాగే వుంటుందనీ, తమ కుటుంబ సభ్యులందరమూ ఆరోగ్యం కోసం దాన్ని తాగుతామంటూ నమ్మించింది. దీనితో అతడు ఆ రసాన్ని మొత్తం తాగేసాడు. ఆ తర్వాత అతడికి వాంతులు అయ్యాయి.
వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అవయవాలన్నీ పాడైపోయి అక్టోబరు 25న మృతి చెందాడు. తనకు వాంతులు అయిన సమయంలో గ్రీష్మ ఇచ్చిన డ్రింక్ గురించి రాజు తన మరో మిత్రుడికి చెప్పాడు. దీన్ని ఆధారం చేసుకుని పోలీసులు గ్రీష్మను అరెస్ట్ చేసారు. విచారణలో ఆమె దోషిగా తేలింది. తనకు కాబోయే భర్తకు తన బోయ్ ఫ్రెండ్... తమ ఏకాంతంగా వున్నప్పటి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తేడేమోనన్న భయంతో అతడిపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రీష్మ అంగీకరించింది. 2022 నుంచి ఈ కేసును విచారించిన కోర్టు చివరికి శుక్రవారం నాడు గ్రీష్మకు శిక్షను ఖరారు చేసింది.