గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2025 (20:41 IST)

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఈటల రాజేందర్ (Video)

etela rajender
మాజీ మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కానీ, ఆయనకు పార్టీలో సముచిత గౌరవం, గుర్తింపు దక్కలేదని భావిస్తున్నారు. పైగా, బీజేపీ అగ్రనాయకత్వం కేవలం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతూ, వారికే అధిక ప్రాధాన్యత ఇస్తుందనే భావన ఆయనలో బలంగా నాటుకుని పోయింది. దీంతో పార్టీ మారాలన్న ఆలోచన తన సన్నిహితుల వద్ద చేసినట్టు సమాచారం. దీనికి ఉదాహరణ ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలే కారణమని అంటున్నారు. 
 
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్.జైపాల్ రెడ్డి 83వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘గొప్ప మహనీయుడు’ అంటూ కితాబిచ్చారు. అదేసమయంలో జైపాల్ రెడ్డిపై ఈటల ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో.. కాంగ్రెస్‌ పార్టీలోకి ఈటల జంప్ అవుతారా? అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. 
 
కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం (2014 నుంచి 2018 వరకు) లో రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా కీలకంగా వ్యవహరించారు. రెండోసారి సీఎం కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వం (2019 నుంచి 2021)లోనూ ఆయన ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్నారు. కానీ, సీఎం కేసీఆర్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా భారత రాష్ట్ర సమితికి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు.