వితంతు పింఛను ఆశ చూపి.. మహిళపై అత్యాచారం... కాకాణి అనుచరుడి అరెస్టు!!
వితంతు పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి ఓ వితంతువుపై అత్యాచారం చేసిన కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుడుని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురైన ఆ మహిళను వితంతు పింఛన్, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి నిందితుడుని అరెస్టు చేశారు. పేరు వెంకట శేషయ్య.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడం గమనించి ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకట శేషయ్య మాయమాటలు చెప్పి వశపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రోజూ ఫోన్ చేస్తూ తన కోరిక తీర్చాలని వేధించాడని బాధితురాలు తెలిపింది.
పైగా, తెల్లకాగితంపై సంతకం చేయించుకుని నిత్యం బెదిరించేవాడని ఆరోపించింది. వెంకట శేషయ్య వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఉద్యోగం ఇప్పిస్తానని వెంకట శేషయ్య తనను మోసం చేశాడని, పలుమార్లు తనపై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో సోమవారం రాత్రి వెంకట శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వెంకట శేషయ్యను అరెస్టు చేశారని తెలిసి మాజీ మంత్రి కాకాణి అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. దీంతో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు వివరాలను వివరించి అందరినీ అక్కడి నుంచి పంపించివేశారు. ఆపై వెంకట శేషయ్యను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు పూర్తయ్యాక కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.