బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (08:52 IST)

క్షణికావేశం... భార్యకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపిచ్చి తాను తాగాడు...

couple suicide
వారిద్దరూ ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వేరు కాపురానికీ వెరవలేదు. అంతలోనే అమ్మనాన్నలు ఆప్యాయంగా మాట్లాడటంతో వారి మాటలు నమ్మాడు. భార్యను తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య మాటలు చెవికెక్కలేదు. మరోవైపు, తల్లిదండ్రుల మాట కాదనలేకపోయాడు. దీంతో చావే శరణ్యమని భావించారు. తన భార్యకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపిచ్చి తాను కూడా సేవించాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు ఈ యువ దంపతులు కొన్ని రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం, దాసుతండా పంచాయతీ రేగులతండాకు చెందిన ఇస్లావత్ వత్మాల్, సరోజకు ఐదుగురు అమ్మాయిలు. చిన్న అమ్మాయి పేరు దీపిక (19). చదువు మధ్యలో ఆపేసి ఇంట్లోనే ఉంటున్నారు. యేడాది క్రితం శుభకార్యానికి వెళ్లిన సమయంలో అదే మండలం వెంకట్యాతండాకు చెందిన బోడా శ్రీను (23) అన యువకుడుతో పరిచయం ఏర్పడింది. ఈ వివాహానికి శ్రీని క్యాటరింగ్ పనికోసం వచ్చాడు. వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది.  ఆ తర్వాత పెద్దల అనుమతి లేకపోయినప్పటికీ వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు ప్రేమజంట శ్రీను ఇంటికి వెళ్లి కాపురం పెట్టింది. రెండు నెలలుగా వారి మధ్య కలహాలు చోటుచేసుకున్నాయి. 
 
ఈ క్రమంలో భార్యపై భర్త చేయి చేసుకున్నాడు. ఈ నెల 20వ తేదీన క్షణికావేశంలో కూల్‌డ్రింక్‌లో క్రిమిసంహారక మందు కలిపి భార్యకు ఇచ్చాడు. ఆ తర్వాత తాను కూడా సేవించాడు. ఈ విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులు వారిద్దరినీ హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ నెల 25వ తేదీన దీపిక చనిపోగా, సోమవారం ఉదయం శ్రీను తనువు చాలించాడు. తన కుమార్తెక చావుకు వరకట్న వేధింపులో కారణమని మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.