పోరాట యోధుడు, తెల్లదొరలకు సింహస్వప్నం: అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజు జన్మదినం జూలై 4, 1897. ఈ సందర్భంగా అల్లూరిని స్మరించుకుందాం. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో తెల్లదొరలకు సింహస్వప్నంగా నిలిచిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఓ అధ్యాయం. స్వాతంత్ర్యం పొందటానికి సాయుధ పోరాటం ఒక్కటే అని నమ్మిన అల్లూరి 27 ఏళ్ళకే స్వతంత్రం కోసం అమరుడయ్యాడు.
యుద్ధ విద్యల్లో ఆరితేరిన రామరాజు ఆనాడు గిరిజన ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు గురవటం చూసి చలించిపోయాడు. గిరిజనుల ధన, మాన, శ్రమ దోపిడికి గురవటాన్ని చూసిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషు అధికారులపై విరుచుకపడ్డాడు.
గిరిజనుల కష్టాలను కడతేర్చేందుకు నడుంబిగించిన రామరాజు వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యం నూరిపోసి తెల్లదొరను ఎదిరించే స్థాయికి వారిని చైతన్య పరిచాడు. తమకు అండగా నిలిచిన అల్లూరిపై గిరిజనులు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి తమ నాయకునిగా స్వీకరించారు. 1922 సంవత్సరం ప్రాంతంలో మన్యంలో కాలుపెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. తన విప్లవ దళాలతో పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు నిర్వహించి బ్రిటిషు అధికారులను గడగడలాడించాడు.
సమాచారం ఇచ్చి మరీ పోలీసుస్టేషనులపై దాడుల నిర్వహించి బ్రిటిషు అధికారుల్లో ముచ్చెమటలు పట్టించాడు. ఈ సంఘనల్లో బ్రిటిషు ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసినప్పటికీ వారిని ఎదిరించలేకపోయారు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. 1922 డిసెంబరు 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను రామరాజు కోల్పోయాడు.
ఆ తర్వాత రామరాజు కొన్నాళ్లు నిశ్శబ్దం పాటించటంతో ఆయన మరణించాడనే పుకార్లు వ్యాపించాయి. అయితే సీతారామరాజు 1923 సంవత్సరం ఏప్రిల్ నెలలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అయితే విప్లవాన్ని అణచివేసే కార్యక్రమంలో బ్రిటిషు అధికారులు, పోలీసులు ప్రజలను భయకంపితులను చేయటం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో అల్లూరి సీతారామరాజు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడు.
తను నది ఒడ్డున ఉన్నానంటూ బ్రిటిషర్లకు సమాచారం ఇచ్చి పంపాడు. నేరుగా వచ్చిన బ్రిటిషర్లు 1924 మే 7న ఏటి ఒడ్డున స్నానమాచరిస్తున్న అల్లూరిని పోలీసులు బంధించారు. ఎటువంటి విచారణ చేపట్టకుండానే సీతారామరాజును అదే రోజున కాల్చి చంపారు. అలా స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించి అమరవీరుడయ్యాడు అల్లూరి సీతారామరాజు.