శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్

ప్రవీణ్ ప్రకాష్ - నిమ్మగడ్డల మధ్య లడాయి... మాపైనే పెత్తనం చెలాయిస్తారా???

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో వివాదం చెలరేగింది. ఇపుడు రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ల మధ్య లడాయి మొదలైంది. 
 
స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26న సమావేశానికి హాజరుకావాలని ప్రవీణ్ ప్రకాశ్ వ్యక్తిగత కార్యదర్శి నుంచి రమేశ్​ కుమార్​కు వర్తమానం వెళ్లడమే ఈ వివాదానికి ఆజ్యం పోసింది. దీనిపై ఎస్​ఈసీ తీవ్రంగా స్పందించారని సమాచారం. 
 
నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్... ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా పనిచేస్తున్నారు. అది హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన హోదా కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవి. 
 
అలాంటి పదవిలో ఉన్న ఆయనకు... సర్వీసులో ఆయన కంటే చాలాచాలా జూనియర్ అయి.. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న అధికారి కార్యాలయం నుంచి శనివారం ఒక వర్తమానం వెళ్లింది. 
 
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఉప ఎన్నికలు, శాసనమండలి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26న సీఎం క్యాంపు కార్యాలయం మొదటి అంతస్తులో ముఖ్యమంత్రి కార్యదర్శి ఒక సమావేశం నిర్వహిస్తున్నారని... దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హాజరవ్వాలన్నది వర్తమానం సారాంశం. 
 
ఆ వర్తమానం చూడగానే నిమ్మగడ్డకు ఎక్కడలేని కోపం వచ్చింది. అంతే.. ఆయన కూడా ఘాటుగా తిరుగు సమాధానం పంపించినట్టు వినికిడి. పైగా, ఎన్నికలకు సంబంధించి నిర్వహించే ఏ సమావేశాలకూ తన అనుమతి లేకుండా వెళ్లవద్దంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శినీ ఆదేశించారు. ప్రస్తుతం ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
 
ఇదిలావుంటే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ నెల 28న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వ్యక్తిగత కార్యదర్శి నుంచి రమేశ్ కుమార్ కార్యాలయానికి శనివారం ఒక వర్తమానం వెళ్లింది. 
 
ప్రవీణ్ ప్రకాష్ ఈ నెల 26న నిర్వహించే సమావేశానికి రమేశ్ కుమార్ హాజరవ్వాలన్నదే దాని సారాంశమని సమాచారం. అదే విషయాన్ని ఆయన వ్యక్తిగత కార్యదర్శికి... ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయ సిబ్బంది ఫోన్ చేసి కూడా చెప్పారు. దీనిపై రమేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారని... వెంటనే ఆయన తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయానికి ఒక లేఖ పంపించారని ఎన్నికల కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి.