గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (08:49 IST)

నిమ్మగడ్డ విషయంలో అర్థరాత్రి జ్ఞానోదయమైంది : సీపీఐ రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా పునర్నియమిస్తూ ప్రభుత్వం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని విమర్శించారు. ఎస్‌ఈసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అర్థరాత్రి జ్ఞానోదయం కలిగిందంటూ ఎద్దేవా చేశారు. ఇతర వివాదాస్పద అంశాలకు కూడా ఇకనైనా ప్రభుత్వం స్వస్తిపలికి, ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలని ఆయన సలహా ఇచ్చారు. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మళ్లీ నియమితులయ్యారు. ఈ మేరకు గత అర్థరాత్రి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది. నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
అయితే, అత్యున్నత ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడే పునర్నియామకం ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, రమేశ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రభుత్వానికి చుక్కెదురైన విషయం తెల్సిందే.