శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (22:44 IST)

ఉత్తరాదిన కరోనా రోగుల దీనస్థితి.. ఈగలతో కూడిన ఆహారం ఇస్తున్నారట..!

ఉత్తరాదిన కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు హాస్పిటల్‌లో ఆహారం నాణ్యతపై ఆందోళన చేశారు. తమకు అందిస్తున్న ఆహారంలో ఈగలొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కరోనాతో అల్లాడుతున్న మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. 
 
కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రులో వున్న తమకు ఇచ్చే ఆహారం కనీసం సరిగా ఉడికించడం లేదని, కంపుకొట్టే ఆహారం అందిస్తున్నారని కొందరు రోగులు చెప్తున్నారు. తినే ఆహారంలో పురుగులు, ఈగలు వస్తున్నాయని, దాన్ని తినలేక చెత్తబుట్టల్లో పడేస్తున్నామని కొందరు పేషెంట్లు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పూణే మున్సిపల్ కమీషనర్.. వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని ఓ బృందాన్ని పంపినట్లు సమాచారం.
 
మరోవైపు భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ ఈ మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతమవుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కరోనా కేసుల విషయంలో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. దేశంలో మొత్తం కోవిడ్‌ కేసులు 13 లక్షల మార్కును దాటేశాయి. 
 
గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసులు 12,87,945గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలో 9615, ఏపీలో రికార్డు స్థాయిలో 8147, తమిళనాడులో 6785, కేరళలో 885, మిగతా రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 13లక్షలు దాటేసింది.